Breaking News

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు భారీ ఊరట..

-మంత్రి సత్యకుమార్‌ ఆదేశాలతో కీలక ఉత్తర్వులు జారీ
-రేడియోగ్రాఫర్లు, నర్సులు, పీహెచ్‌సీ సిబ్బంది సమస్యలకు పరిష్కారం
-ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహకాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) విజ్ఞప్తులపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్‌ యాదవ్‌ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు సమీక్షలు నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారులు కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట నిచ్చేలా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. వీటివల్ల చాలా ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో కనిపించనున్నాయి.

రేడియోగ్రాఫర్లకు ప్రత్యేక సెలవులు

రేడియేషన్‌ ముప్పును ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్‌ రేడియోగ్రాఫర్లు, రేడియోగ్రాఫిక్‌ టెక్నీషియన్లకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. బోధనాస్పత్రుల్లో ఎక్స్‌రే, రేడియాలజీ విభాగాల్లో విధులు నిర్వహించే అర్హులైన సిబ్బందికి ప్రతి 11 నెలల విధి పూర్తయిన తర్వాత 30 రోజుల తప్పనిసరి ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ సెలవును సాధారణ లీవ్‌ ఖాతా నుంచి మినహాయించరాదని స్పష్టం చేసింది.

సిబ్బంది సర్దుబాటుపై

పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత, విధుల సర్దుబాటుపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని ఆదేశించింది. పగటి సమయంలో ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓల సేవలను, రాత్రి సమయంలో అవసరానికి అనుగుణంగా ఎస్‌ఏడబ్ల్యూల సేవలను వినియోగించాలని సూచించింది. ముఖ్యంగా రాత్రి విధులు నిర్వహించే సిబ్బందికి సహాయకంగా వీరి సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొంది.

నర్సులపై పని భారం తగ్గిస్తూ

నర్సులపై ఉన్న 12 గంటల నిరంతర విధి భారం తగ్గించేలా కూడా చర్యలు తీసుకున్నారు. పీహెచ్‌సీలో ముగ్గురు నర్సులు పనిచేస్తున్న సందర్భంలో ఒకరు సెలవులో ఉన్నా, మిగిలిన సిబ్బందితో రొటేషన్‌ పద్ధతిలో విధులు సర్దుబాటు చేయాలని ఆదేశించారు. పగటి సమయంలో ఒక నర్సుపై 12 గంటల నిరంతర విధి భారం పడకుండా చూడాలని స్పష్టం చేశారు. స్థానికంగా అందుబాటులో ఉన్న ANM సేవలను సమర్థంగా వినియోగించుకుని విధులు సర్దుబాటు చేయాలని సూచించారు.

PHC ల్లో విద్యార్థులకు శిక్షణ

డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ) విద్యార్థులకు కూడా పీహెచ్‌సీల్లో క్లినికల్‌ శిక్షణకు అవకాశం కల్పించారు. 6 లేదా 12 నెలల క్లినికల్‌ శిక్షణలో భాగంగా నెలరోజుల పాటు పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో శిక్షణ పొందేలా మార్గదర్శకాలు జారీ చేశారు. విద్యార్థులకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు శిక్షణ కేంద్రాలను కేటాయించనున్నారు.

NTRVST కింద ప్రోత్సాహకాలు

శస్త్రచికిత్సలు, ప్రొసీజర్లకు ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌ ద్వారా అందే ప్రోత్సాహకాల్లో డాక్టర్లతో పాటు వాటిలో పాల్గొనే కాంట్రాక్ట్‌ పారామెడికల్‌ సిబ్బందికీ వారి క్యాడర్‌కు అనుగుణంగా నిర్ణయించిన వాటా ఇవ్వాలని ఆదేశించారు. స్టాఫ్‌ నర్సులు, OT టెక్నీషియన్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర సంబంధిత సిబ్బందిని కూడా అర్హత మేరకు చేర్చాలని స్పష్టం చేశారు. ప్రతి నెల శస్త్రచికిత్సలు, పాల్గొన్న సిబ్బంది, వారికి అందే ప్రోత్సాహక మొత్తాల వివరాలను నోటీస్‌ బోర్డులో ప్రదర్శించాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *