Breaking News

సరికొత్తగా హస్త కళలు

-ఆధునిక డిజైన్లతో సంస్కృతీ సంప్రదాయల కళారూపాలు
-కళారూపాల తయారీలో 770 మంది కళారులకు శిక్షణ
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహణ
-రూ.1.35 కోట్లు విడుదల చేసిన కేంద్రం
-క్లస్టర్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు
-200 మందికి శిక్షణతో పాటు టూల్ కిట్ల అందజేస్తాం
-ఆదాయం, ఉపాధే లక్ష్యంగా హస్త కళాకారులకు శిక్షణ
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మారుతున్న అభిరుచులు, హస్త కళలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హస్త కళాకారులకు మెరుగైన జీవనం, ఆర్థిక భరోసా కలిగించేలా చర్యలు చేపట్టాయి. హస్త కళారూపాల తయారీలో మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీలో శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.35 కోట్లను వెచ్చించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళారూపాలను తయారు చేస్తున్న 770 మంది హస్త కళాకారులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందుకోసం శిక్షణా కార్యక్రమాలు ఆయా కళారూపాలను బట్టి నెల, రెండు నెలల పాటు ఇవ్వనున్నారని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో చేతివృత్తులకు అండగా నిలవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు ఆర్థిక మేలు కలిగించడంతో పాటు చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇప్పుడు హస్త కళాకారులకు కూడా ఆర్థిక భరోసా కలిగేలా ఆయా కళారూపాల తయారీలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రఖ్యాతిగాంచిన హస్త కళారూపాలను తయారీ చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయన్నారు. ఈ శిక్షణల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.1,35,16,314లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.1.01 కోటి నిధులు మంజూరయ్యాయన్నారు. రాష్ట్రంలో ఆయా క్లస్టర్లలో ఉన్న హస్త కళాకారులకు రెండు విధాలుగా శిక్షణివ్వనున్నట్లు వెల్లడించారు. గురు-శిష్యహస్త శిల్ప్ ప్రశిక్షణ్(జీహెచ్పీపీ), డిజైన్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్ (డీడీడబ్ల్యూ) ద్వారా నెల, రెండు నెలల శిక్షణ ఇవ్వనున్నామన్నారు. గురు-శిష్య హస్త శిల్ప్ ప్రశిక్షణ్(జీహెచ్పీపీ) రెండు నెలలు, డిజైన్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్ (డీడీడబ్ల్యూ) నెల రోజుల పాటు శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు. డిజైన్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్ (డీడీడబ్ల్యూ)లోని కొయ్యబొమ్మల తయారీకి కూడా రెండు నెలల పాటు ఇవ్వనున్నామన్నారు.

200 మందికి శిక్షణతో పాటు పనిముట్లు

గురు-శిష్యహస్త శిల్ప్ ప్రశిక్షణ్(జీహెచ్పీపీ) శిక్షణ కార్యక్రమంలో భాగంగా చెక్క బ్లాక్ తయారీ, కలంకారి బ్లాక్ ప్రింటింగ్, దుర్గి రాతి శిల్పం, అగరుబత్తి తయారీ, తాటి ఆకుల కళ, కొబ్బరి చిప్పల కళ, శ్రీకాళహస్తి కలంకారి వంటి హస్తకళలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. డిజైన్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్ (డీడీడబ్ల్యూ) ద్వారా చెక్క శిల్పం, టెర్రకోట బొమ్మలు, లేస్/హ్యాండ్‌మేడ్ నిటెడ్ గూడ్స్, అల్లగడ్డ రాతి శిల్పం, శ్రీకాళహస్తి కలంకారి, వెదురు-చెరకు కళలు, సవర గిరిజన చిత్రకళ, బొబ్బిలి వీణ, ఇమిటేషన్ జ్యువెలరీ తదితర కళారూపాల తయారీపై మరో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. వారిలో అనంతపురం, పల్నాడు, అనకాపల్లి క్లస్టర్లకు చెందిన 50 మంది చొప్పున 200 మంది అరటి ఫైబర్, చెరకు-వెదురు, వుడ్ టర్నింగ్, ల్యాకర్‌వేర్, దుర్గి రాతి శిల్ప కళాకారులకు శిక్షణతో పాటు ఇంప్రీవుడ్ టూల్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ప్రొగ్రామ్(ఐటీడీపీ) ద్వారా పనిముట్లు పంపిణీ చేయనున్నామన్నారు. ఈశిక్షణా కార్యక్రమాలు కృష్ణా, గుంటూరు, ఎన్‌టీఆర్, అనకాపల్లి, డా. బీఆర్. అంబేద్కర్ కోనసీమ, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, తూర్పు గోదావరి, నంద్యాల, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనంతపురం, పల్నాడు తదితర జిల్లాల్లోని కళాకారులకు ఉపయోగపడనున్నాయని మంత్రి తెలిపారు.

కళాకారుల ఆదాయం పెంపే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు, కళాకారుల ఆదాయాన్ని పెంచడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. సంప్రదాయ కళలను కాపాడుతూ ఆధునిక డిజైన్లు, మెరుగైన శిక్షణ, నాణ్యమైన పనిముట్లు అందించడం ద్వారా హస్తకళాకారులకు ఆర్థికంగా మరింత వెన్నుదన్నుగా ఉండేలా ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. త్వరలోనే ఈ శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నామని మంత్రి సవిత తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *