-ఎన్నికల అక్రమాలు, పోలీసుల పక్షపాతంపై సమగ్ర విచారణ జరపాలి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేతా పూర్తిగా విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న ప్రజాస్వామ్య వ్యతిరేక పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ అనిల్ చంద్ర పునేతా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఎన్నికల కమిషన్ అధికార కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును, అభ్యర్థుల ఎన్నికల హక్కులను పరిరక్షించాల్సిన కమిషన్ ప్రేక్షకపాత్ర వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. ఎన్నికల అక్రమాలపై సీపీఐ పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం కమిషన్ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, పల్నాడు, కాకినాడ, కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో సీపీఐ పోటీ చేసిన ప్రాంతాల్లో పోలీసుల పక్షపాత వైఖరి, ఎన్నికల ఏజెంట్లకు ఆటంకాలు కల్పించడం, బూత్ ఏజెంట్లను అనుమతించకపోవడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఈశ్వరయ్య ఆరోపించారు. వీటిపై అనేక ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం దారుణమన్నారు.
ముఖ్యంగా రాత్రి 10 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతానికి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వెల్లడించిన పోలింగ్ శాతానికి మధ్య 6 నుంచి 7 శాతం వ్యత్యాసం కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసి బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన తర్వాత అదనంగా ఓట్లు ఎలా పెరిగాయని, ఏ ప్రాతిపదికన పోలింగ్ గణాంకాలను సవరించారని ఎన్నికల కమిషన్ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు ఇవ్వకుండా నిలిపివేయడం, పోలీసుల జోక్యంతో ఫలితాల ప్రక్రియను ప్రభావితం చేయడం ఎన్నికల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో రౌడీయిజం, గూండాయిజం, సైలెంట్ రిగ్గింగ్, బూత్ల ఆక్రమణలు, నాయకులు, అభ్యర్థులను బెదిరించడం, కోట్లాది రూపాయల నగదు పంపిణీ వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థలోని కొందరు అధికారులు అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరగాలని కోరారు.
అధికారంలో ఉన్నవారే ఎన్నికలను శాసిస్తే, ఎన్నికల కమిషన్ మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడని ఈశ్వరయ్య ప్రశ్నించారు. పోలీసులే పక్షపాతానికి పాల్పడితే బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలని నిలదీశారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థే నిష్క్రియంగా ఉంటే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యక్తిగత, రాజకీయ విధేయతలకు అతీతంగా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ పట్ల విధేయత చూపుతారా? లేక రాజ్యాంగం పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తారా? అనేది అనిల్ చంద్ర పునేతా తేల్చుకోవాలని సూచించారు.
ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసినందుకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోందని ఈశ్వరయ్య తెలిపారు. ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఓటు హక్కు అధికార పార్టీ ఆస్తి కాదని, ప్రజాస్వామ్యం పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేది కాదని ఆయన స్పష్టం చేశారు.
