-స్మోర్ట్ పోలీసింగ్‌లో ప్రథమ స్థానం
-జాతీయ స్థాయిలో 150 అవార్డులు
-దిశ యాప్‌కు అపూర్వ స్పందన
-స్పందనలో 40,404 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం వార్షిక క్రైమ్ నివేదికను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతానికి భిన్నంగా పోలీసు శాఖలో వచ్చిన మార్పులతో సామాన్యుడు స్వేచ్ఛగా పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని, దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయని, అయినప్పటికీ గత ఏడాదికంటే 3 శాతం మాత్రమే కేసులు ఎక్కువ నమోదయ్యాయని అన్నారు. 2021 సంవత్సరానికి సంబంధించి 75.09 శాతం కేసులను పరిష్కరించామన్నారు. లైంగిక దాడుల వంటి నేరాల కేసులు త్వరితగతిన పరిష్కారానికి నోచుకున్నాయని, 75 అత్యాచారం, 1,061 లైంగిక దాడుల నేరాల్లో ఏడు రోజుల్లోనే ఛార్జిషీటు వేశామన్నారు. 97.42 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 34,037 మంది పిల్లలకు భద్రత కల్పించామని ఆయన తెలిపారు. 1,63,033 స్పందన పిటీషన్లు రాగా, వాటిలో 40,404 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని అన్నారు. ఆపరేషన్ పరివర్తనలో 7,226 ఎకరాల గంజాయి ధ్వంసం చేశామని, 3,14,514.4 కేజీల గంజాయి, 1,694 వాహనాలు సీజ్ చేసి, 6,792 మందిని అరెస్టు చేశామన్నారు. 2,762 గంజాయి కేసులు నమోదయ్యాయని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ గంజాయిను ధ్వంసం చేశామని, 43,293 లిక్కర్ కేసులు పెట్టి 60,868 మందిని అరెస్టు చేశామని, లిక్కర్ కేసులలో 20,945 వాహనాలు సీజ్ చేశామని వివరించారు. ప్రతి పోలీసుస్టేషన్‌లో 100 ఎంబీపీఎస్ వరకూ నెట్ కనెక్టివిటీ ఇస్తున్నామని, ఎపీ పోలీసు డేటా సెంటర్‌ను టియర్`3కు, మానవ వనరులు ఐదు రెట్లుకు పెంచామన్నారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ, గుజరాత్‌తో ఎంఓయూ చేసుకున్నామని, 50 సైబర్ సేఫ్ కియోస్క్‌లు రాష్ట్రంలో ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో ఛార్జిషీట్‌ల నమోదుకు సంబంధించి సుదీర్ఘ సమయం పట్టేది. అయితే ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో వచ్చిన మార్పులు టెక్నాలజీ సాయంతో కేవలం 42 రోజుల సమయంలోనే ఛార్జీషీట్లు దాఖలు చేసే పరిస్థితి ఏర్పడిరది. ఇక ఆస్తుల సంబంధించిన కేసుల్లో 6 శాతం తగ్గుదల నమోదైంది. మరోవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గడం మంచి పరిణామంగా పేర్కొనవచ్చన్నారు. ప్రజలకు, ప్రత్యేకంగా మహిళలకు భద్రత కోసం పోలీస్ శాఖ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. మానవ హక్కుల కమీషన్, ఎస్సీ, ఎస్టీ కమీషన్, మహిళా కమీషన్, బాలల హక్కుల కమీషన్ ప్రశంసించినట్లు పేర్కొన్నారు. పోలీసు శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, సిబ్బంది కృషి ఫలితంగా జాతీయ స్థాయిలో 150 అవార్డులను అందుకున్నామని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌లో రాష్ట్రం నెంబర్-1గా ప్రథమ స్థానం నిలవడం గర్వకారణంగా వుందన్నారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.