-253వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వార్డు సచివాలయాల సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియం ప్రాంగణంలోని 253 వ వార్డు సచివాలయాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, 62వ డివిజన్ కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. సంక్షేమ పథకాల అమలు శాచ్యురేషన్ పద్ధతిలో జరగాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సేవలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సంక్షేమ క్యాలెండర్ పై ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచాలన్నారు. మరోవైపు అగ్రవర్ణ పేద మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 9 న అమలు చేయనున్న ఈబీసీ నేస్తం పథకంపై ఇప్పటినుంచే సచివాలయ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని మల్లాది విష్ణు అన్నారు. డివిజన్ లోని అగ్రవర్ణ పేదలకు ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్టేడియం ప్రాంగణంలో స్వచ్ఛ సంకల్ప వాహనాలను ప్రారంభించారు. ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛ సంకల్పం నూరు శాతం సాఫల్యత ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ కోటేశ్వరరావు, నాయకులు అఫ్రోజ్, అలంపూర్ విజయ్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, శర్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.