విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 22వ, 23వ వార్షిక స్నాతకోత్సవంలో 125 మందికి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, క్యాష్ ప్రైజెస్ అందించ నున్నామని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ డా. పి. శ్యామ ప్రసాద్ అన్నారు.
విజయవాడ డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిపాలనా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 22వ, 23వ వార్షిక స్నాతకోత్సవాల సందర్భంగా హాజరు కానున్న ముఖ్య అతిధిలు, ప్రదానం చేయనున్న డిగ్రీ పట్టాలు, మెడల్స్ వివరాలను పాత్రికేయులకు వైస్ చాన్సలర్ శ్యామ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా శ్యామ ప్రసాద్ మాట్లాడుతూ గురువారం ఉదయం 11.30 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న వార్షిక స్నాతకోత్సవంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి బిశ్వ భూషణ్ హరిచందన వర్చువల్ గా హాజరు కానున్నారని అయన తెలిపారు. ముఖ్య అతిథిలుగా గౌరవ డాక్టరేట్ గ్రహీతలు డా. సి. పళణివేలు, చైర్మన్ జెమ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (కోయంబత్తూరు), డా. డి. నాగేశ్వర్ రెడ్డి, చైర్మన్ &ఫౌండర్ ఆఫ్ ఆసియన్ ఇనిస్టిట్యూట్ గ్యాస్ట్రో ఎంట్రాలజి (హైదరాబాద్) మరియు యూనివర్సిటీ పాలక వర్గం సభ్యులు, విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన నున్నారని వైస్ ఛాన్స్ లర్ డా. పి. శ్యామ ప్రసాద్ తెలిపారు.
ఈ స్నాతకోత్సవంలో దేశంలోనే ఎక్కవ శస్త్ర చికిత్సలను నిర్వహించి, వైద్య రంగానికి ఎనలేని సేవలు అందించిన జెమ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డా. సి. పళణివేలుకు, గ్యాస్ట్రో ఎంట్రాలజిలో నిపుణులైన మరియు వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజషన్ కు గతంలో అధ్యక్షునిగా చేసిన డా. డి. నాగేశ్వర్ రెడ్డి కి డా. ఎన్. టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ని ప్రదానం చేయనున్నది. వీరితో పాటు 22వ స్నాతకోత్సవానికి 58 మంది విద్యార్థులకు 50 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్ మెడల్స్, 19 క్యాష్ ప్రైజ్ లు అందించనున్నారని, 23వ స్నాతకోత్సవానికి సంబంధించి 67 మంది విద్యార్థులకు 57 గోల్డ్ మెడల్స్, 22 సిల్వర్ మెడల్స్, 23 క్యాష్ ప్రైజ్ లను అందించనున్నారని వైస్ ఛాన్సెలర్ చెప్పారు. పి. హెచ్. డి. కోర్సు కు సంబంధించి 5 మందికి, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఒకరికి, పి.జి. డిగ్రీ 18 మందికి ప్రదానం చేయనున్నారని శ్యామ ప్రసాద్ తెలిపారు. కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ వార్షిక స్నాతకోత్సవ ఏర్పాట్లు చేశామని ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారందరూ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని వైస్ ఛాన్స్ లర్ డా. పి. శ్యామ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. కె. శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …