-లబ్బీపేటలో ఘనంగా శ్రీ కృష్ణా మండల వేద విద్వత్ర్పవర్ధక సభ 73 వ వార్షిక మహోత్సవాలు
-వేద పరీక్షలలో ఉత్తీర్ణులైన పండితులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాల అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేదాలను, వేద పండితులను గౌరవించుకునే చోట సాక్షాత్తూ అమ్మవారు కొలువై ఉంటారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ కృష్ణా మండల వేద విద్వత్ర్పవర్ధక సభ 73 వ వార్షిక మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఆలయ చైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యం సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణుని ఘనంగా సత్కరించారు. ‘స్వాధ్యాయ రత్న’ విష్ణుభట్ల నాగ శంకర వెంకట లక్ష్మీనారాయణ ముఖ్య పరీక్షాధికారిగా జరిగిన ఘనపాఠి పరీక్షలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 50 మంది వేద పండితులు హాజరయ్యారు. వీరిలో జొన్నవిత్తుల లీలా సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠి పట్టా అందుకోగా, శిష్ట్లా వేంకట సుబ్రహ్మణ్య కౌశిక శర్మ, గార్లపాటి వేంకట పవన చంద్ర మణికంఠ శ్రీరామశర్మ క్రమాపాఠి పట్టా అందుకున్నారు. వీరందరికీ శాసనసభ్యులు ప్రశంసాపత్రాలు బహూకరించారు. ఘనపాఠికి రూ. 8,200, క్రమాపాఠిలకు రూ. 7,200 చొప్పున నగదు అందజేశారు.
గత 73 ఏళ్లుగా క్రమం తప్పకుండా వేద పండితులకు ఏటా వేదాలపై పరీక్షలు నిర్వహించి పట్టాలు అందజేయడం అభినందనీయమని మల్లాది విష్ణు అన్నారు. ఆధునిక పరిశోధకుల ఊహలకు సైతం అంతుచిక్కని విద్య, వైజ్ఞానిక, సామాజిక, ఆర్థిక విషయాలెన్నో వేదాల్లో ఉన్నాయని.. అటువంటి అమూల్య గ్రంథాలు మనకు వారసత్వ సంపదగా లభించడం మన అదృష్టమని అన్నారు. వేదాల్లో ఉన్న గొప్పదనాన్ని విదేశీయులు సైతం కీర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. వేద విద్యార్థుల పరీక్షలు నిర్వహించి, వారికి పట్టాలు మంజూరు చేసే ప్రామాణిక సంస్థగా శ్రీ కృష్ణా మండల వేద విద్వత్ర్పవర్ధక సభకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉందని మల్లాది విష్ణు తెలిపారు. శ్రీ కృష్ణా మండల వేద విద్వత్ర్పవర్ధక సభ 75 వ వార్షికోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి సహాయ సహకారాలు అందజేయడంతో పాటు.. ఈ పరీక్షలకు కూడా ప్రభుత్వం తరపు నుంచి గుర్తింపు లభించేలా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారని.. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వేద పండితులు, అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం తరపున ఆయన అందించిన సాయం మరువలేమన్నారు. అనంతరం పలువురు ప్రముఖ ఘనపాఠి, క్రమాపాఠిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ జంధ్యాల శంకర్, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు.