-రూ.20 కోట్ల మేర అదనంగా నగదు పరపతికి అంగీకారం
-వడ్డీ రాయితీ రూపేణా రూ.27 కోట్లు లాభపడనున్న ఆప్కో
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభజనానంతర సమస్యల ఫలితంగా గత కొంత కాలంగా నిలిపి ఉంచిన ఆప్కో నగదు పరపతి ఖాతాను తిరిగి పునరుద్దరించేందుకు అప్కాబ్ అంగీకరించింది. గత నాలుగు సంవత్సరాలుగా ఈ విషయంపై రెండు సంస్ధల నడుమ చర్చలు జరుగుతున్నప్పటికీ మంగళవారం అయా సంస్ధల ఛైర్మన్ల స్ధాయిలో జరిగిన సమావేశం సత్ ఫలితాలను ఇచ్చింది. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆప్కో నుండి సంస్ధ ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ నాగరాణి, చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు కన్నబాబు, సహాయ సంచాలకులు నాగరాజరావు , ఆప్కాబ్ నుండి సంస్ధ ఛైర్మన్ యం.ఝాన్సీరాణి, ఎండి డాక్టర్ ఆర్ శ్రీనాధ రెడ్డి , సిజిఎం రాజయ్య , డిజిఎం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మాట్లాడుతూ విభజనకు పూర్వం ఆప్కో నగదు పరపతి ఖాతా రూ.100 కోట్ల మేర ఆప్కాబ్ వద్ద ఉండగా, విభజన నేపధ్యంలో దానిని 58.32 కోట్లకే పరిమితం చేసారన్నారు. సంస్ధ ఎదుగుదల రీత్యా ఈ మొత్తాన్ని పెంచాలని కోరుతూవస్తున్నామని , రెండు సంస్ధల మద్య జరిగిన ఫలప్రదమైన చర్చల ఫలితంగా రూ.20 కోట్ల మేర అదనంగా నగదు పరపతిని పెంచేందుకు అప్కాబ్ అంగీకరించిందన్నారు, సంస్ధ ఎండి నాగరాణి మాట్లాడుతూ విభజనకు పూర్వం ఉన్న బకాయిల ఫలితంగా పేరుకు పోయిన వడ్డీ, అపరాధ వడ్డీల రూపేణా రూ.53.42 కోట్లు చెల్లించవలసి ఉండగా, కొంతమేర వడ్డీ రాయితీని ఇచ్చేందుకు అంగీకరించారని తద్వారా రూ.26 కోట్లు మాత్రమే చెల్లించవలసి ఉంటుందని వివరించారు. మరోవైపు చేనేత సహకార సంఘాలకు నగదు పరపతి చెల్లింపులు యాభై శాతానికి లోబడి ఉండగా, ఆప్కో నుండి అయా సంఘాలకు చెల్లించ వలసిన బకాయిలను పరిగణనలోకి తీసుకుని నగదు పరపతిని ఆమేర రెన్యువల్ చేసేందుకు కూడా ఆప్కాబ్ అంగీకరించింది. చిల్లపల్లి మాట్లాడుతూ ఈ పరస్పర అంగీకారం వల్ల చేనేత కార్మికులకు లబ్డి చేకూరుతుందని, అదనపు పరపతి లభించటం వల్ల ఉత్పత్తి సామర్ధ్యం పెరిగి మరికొంత మందికి పని లభిస్తుందన్నారు. అయా సొసైటీలు పలు బ్యాంకులలో ఖాతాలు కలిగి ఉండగా, వాటిని ఆప్కోకు మార్చుకుంటే మంచి పరపతి పధకాలను అమలు చేసేందుకు కూడా ఆప్కాబ్ ప్రతినిధులు హామీ ఇచ్చారన్నారు.