-చిన్న పని అంటూ ఏదీ లేదు, నైపుణ్యాభివృద్ధితోనే అభివృద్ధి.
-హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన శిక్షణార్ధులతో ఉపరాష్ట్రపతి మాటామంతి
-మాతృభాషలో మాట్లాడేందుకు గర్వపడాలి
-విద్య జీవనోపాధి కోసం మాత్రమే కాదు, జీవితాన్ని తీర్చిదిద్దడానికి కూడా
-ఆరోగ్యకరమైన ఆహారం, చైతన్యంతో కూడిన అలవాట్లను అలవరచుకోవాలి
-ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం మన జీవన విధానం కావాలి
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ, క్రమశిక్షణతో, కష్టపడే తత్త్వంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ కు మంగళవారం విచ్చేసిన ఆయన, అక్కడ శిక్షణ పొందుతున్న దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన శిక్షణార్ధులతో ముచ్చటించారు.
సమాజంలో చిన్న పని అంటూ ఏదీ ఉండదన్న ఉపరాష్ట్రపతి, నైపుణ్యాన్ని పెంపొందించుకుని, కష్టపడే తత్త్వంతో ముందుకు సాగితే, ఏ వృత్తిలోనైనా ఉన్నత స్థాయి రాణింపు సాధ్యమౌతుందని సూచించారు. చదివిన చదువు జీవనోపాధి కోసం మాత్రమే కాదన్న ఆయన, చదువు ద్వారా విజ్ఞానం, తద్వారా సమాజంలో మనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకునే విధంగా తమను తాము తీర్చిదిద్దుకునేలా ఉండాలని ఆకాంక్షించారు. అవకాశాలను అందిపుచ్చుకోవడం, క్రమశిక్షణతో నేర్చుకోవడం, కష్టపడి సంపాదించుకోవడం, సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నలుగురితో కలిసి పంచుకోవడం ప్రతి ఒక్కరూ జీవితంలో అలవరుచుకోవలసిన జీవన సూత్రమని తెలిపారు.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల రాకతో స్వర్ణభారత్, మినీ భారత్ ను తలపిస్తోందన్న ఉపరాష్ట్రపతి, శిక్షణార్ధులకు మాతృభాష ప్రాధాన్యతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు, సోదర భాషలను కూడా నేర్చుకోవాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి మనకు ఎన్నో జీవన సూత్రాలను నేర్పిందన్న ఆయన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, మానసిక ప్రశాంతత కోసం యోగ, ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించడం, వ్యక్తిగత పరిశుభ్రతతను పాటించడం చక్కని జీవనానికి అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం జీవితానికి అత్యంత ఆవశ్యకమన్న ఉపరాష్ట్రపతి, సాటి మనుషులతో పాటు జంతుజాలాన్ని, ప్రకృతిని గౌరవించడం భారతీయ జీవనవిధానంలో భాగమని తెలిపారు.
భారతదేశం అంటే భూభాగం మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ అన్న ఉపరాష్ట్రపతి కుల, మతాలకు అతీతంగా సోదరభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ లాంటి సంస్థల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా, వారి భాషా సంస్కృతుల మీద అవగాహన ఏర్పడుతుందని, ఇది భవిష్యత్తులో మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందరూ సుఖంగా జీవించాలని ఆరాటపడుతున్నారే తప్ప, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించటం లేదని సేవలో ఉండే సంతోషం మరెందులోనూ లభించదని తెలిపారు.
సనాతన కాలం నుంచి భారతదేశం ఉన్నతమైన విలువలకు చిరునామాగా విలసిల్లిందన్న ఉపరాష్ట్రపతి, ఆ విలువలను కాపాడుకోవడం ద్వారా, జీవితానికి అన్వయించుకోవడం ద్వారా ఉన్నతమైన భవిష్యత్ సాధ్యమౌతుందని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ సిబ్బందితో పాటు అస్సాం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన శిక్షణార్థులు తదితరులు పాల్గొన్నారు.