-కుటుంబ చిత్ర కథానాయకుడు, వెండితెర ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నట భూషణుడు, అందాల నటుడు శోభన్ బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సోగ్గాడని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. స్టేట్ వైడ్ శోభన్ సిండికేట్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కళ్లేపల్లి మధుసూదన రాజు, ధారా సత్యనారాయణ ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని శోభన్ బాబు సర్కిల్ వద్ద నిర్వహించిన శోభన్ బాబు 86 వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. చిత్ర సీమలోకి స్వశక్తితో వచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి శోభన్‌బాబు అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 300 పైగా చిత్రాలలో నటించి.. ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారన్నారు. అధికంగా కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారన్నారు. అటువంటి గొప్ప నటుడు మన కృష్ణా జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణమన్నారు. సినీరంగంలో ఉన్నా.. క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయనొక ఉదాహరణగా నిలిచారన్నారు. భౌతికంగా శోభన్ బాబు దూరమైనా అభిమానుల గుండెల్లో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారన్నారు. నేటికీ శోభన్ బాబు అభిమానులు ఆయన పేరిట ప్రతి సంవత్సరం కార్యక్రమాలను నిర్వహించడం హర్షణీయమన్నారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో సాయి, ప్రబల శ్రీనివాస్, పైడిపాటి వెంకన్న, కె.వి.సుబ్బరాజు, నారాయణ, శోభన్ బాబు అభిమానులు పాల్గొన్నారు.