-ప్రజలకు మెరుగైన సేవలకు డాక్టర్లు, పేరా మెడికల్ సిబ్బంది నియామకం అవసరమన్న మంత్రి
-మంజూరైన పోస్టులు, ఖాళీలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష
-కథ నడిస్తే చాలు… బిజినెస్ యాజ్ యూజ్‌వల్ అన్న వైఖరిని వైద్య సిబ్బంది మార్చుకోవాలని మంత్రి హితవు
-హనీమూన్ కాలం అయిపోయింది…కొత్త ఆలోచనలతో పనితీరును మెరుగుపర్చుకోవాలని నొక్కివక్కాణించిన మంత్రి
-ప్రతి పథకం అమలుపై నెల వారీ నివేదికలు కోరిన సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాల నిర్వహణ తీరు, వైద్య సిబ్బంది కొరత, సిబ్బంది దృక్పధం, జవాబుదారీతనం విషయాలకు సంబంధించి రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ శుక్రవారం నాడు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘమైన సమీక్ష చేసి పలు ఆదేశాలు జారీ చేశారు. పలు కేటగిరీల్లో మంజూరైన పోస్టులు, సిబ్బంది లభ్యతను సమీక్షించి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు 7 నుంచి 8 వేల సిబ్బంది నియామకానికి అవకాశాలున్నందున ఆమేరకు ప్రాధాన్యతల ఆధారంగా తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
గత ఏడు నెలలుగా వివిధ స్థాయిల్లో వైద్య సిబ్బంది పనితీరును వివరించి ‘కథ నడిస్తే చాలు’ అన్న వైఖరిని విడనాడి కొత్త ఆలోచనలతో వివిధ పథకాల కింద ప్రజలకందించే వైద్య సేవల నాణ్యతను పెంచి జవాబుదారీతనంతో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచరించారు. ప్రతి నూతన ప్రభుత్వానికీ లభించే ఆరేడు నెలల హనీమూన్ కాలం ముగిసిందని, ఇకనుండి వైద్య సిబ్బంది పనితీరు, ఫలితాలకు సంబంధించి క్రమానుగతంగా సమీక్షించి ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, సంబంధిత మంత్రులు మరియు సిబ్బంది ప్రజలకు జవాబు చెప్పుకోవాలని, ఈ సమిష్టి బాధ్యతను వైద్య సిబ్బంది గుర్తించాలని సూచించారు. వివిధ పథకాల అమలు, ఫలితాల్ని సమీక్షించడానికి వీలుగా నెలవారీ నివేదికల్ని సమర్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆయా పథకాల అమలుకు సంబంధించి నిరంతరం ప్రజలకు సమాచారాన్ని అందించే బాధ్యత సంబంధిత శాఖాధిపతులదని మంత్రి స్పష్టం చేశారు.
సిబ్బంది లభ్యత గురించి మాట్లాడుతూ…వైద్య, ఆరోగ్య శాఖ కింద ప్రధాన విభాగాల్లో మొత్తం 1,01,125 పోస్టులు మంజూరై ఉండగా, ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో 26,263 ఖాళీలున్నాయని మంత్రి వెల్లడించారు. ఈమేరకు మొత్తం మంజూరైన సిబ్బందిలో 25.97 శాతం కొరత ఉందన్నారు. ఈ వివరాలు….”జీరో వేకెన్సీ” కింద ఆరోగ్య శాఖలో ఎటువంటి ఖాళీలు లేకుండా సిబ్బందిని నియమించామని గత ప్రభుత్వాధినేతలు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. డాక్టర్ల కొరత 21.41 శాతం ఉందని, ఇతర పేరా మెడికల్ మరియు సహాయక సిబ్బంది కొరత 26.78 శాతముందని మంత్రి వివరించారు.
ప్రభుత్వ బోధానాసుపత్రుల్లో సిబ్బంది కొరత 37.04 శాతం ఉండగా, ప్రాథమిక వైద్య సేవలందించే ఆసుపత్రుల్లో ఇది 28.96 శాతం ఉందని, ప్రాంతీయ మరియు జిల్లా ఆసుపత్రుల్లో 14.51 శాతం కొరత ఉందని, ఆయుర్వేద, హోమియోపతి మరియు యునాని ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అత్యధికంగా 63.40 శాతముందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం హోమియోపతి, ఆయుర్వేద, యునాని వైద్యాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. .టి.కృష్ణబాబు ఖాళీగా చూపబడిన మొత్తం పోస్టుల్లో కొన్నింటిని రద్దుచేసి సమకాలీన అవసరాల కోసం కొత్త పోస్టుల్ని కల్పించడం జరిగిందని, మరికొన్ని పోస్టుల్ని పదోన్నతుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని వివరించారు. సిబ్బంది కొరతను సమగ్రంగా సమీక్షించి ప్రాధాన్యతల ఆధారంగా ఏడెనిమిది వేల పోస్టుల భర్తీకి ప్రణాళిక రూపొందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
తరచుగా త్రాగునీరు, కీటక జనిత వ్యాధులు ప్రబలడం, ప్రస్తుత జీవన అలవాట్ల ఆధారంగా భారీ స్థాయిలో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమిక( నాన్ కమ్యునకబుల్) వ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో శుభ్రత, సరైన జీవన విధానం మరియు ఆహారం విషయాల్లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కల్పించడానికి ప్రభావంతమైన ప్రచార కార్యక్రమాన్ని తక్షణమే రూపొందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ అసంక్రమిక వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు సమాజంలోని ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు, సంస్థల సేవల్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వైద్య,ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ వర్చువల్ గా పాల్గొనగా… సెకండరీ హెల్త్ డైరెక్టర్ మరియు ఎపిఎంఎస్ ఐడిసి ఎం.డి డాక్టర్ ఎ.సిరి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నరసింహం తదితరులు పాల్గొన్నారు.