అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో రెండు రోజుల నిర్వహించిన ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర మంత్రులు జైశంకర్, శోభకరంద్లాజే ని కలిసి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెండింగ్ లో ఉన్న విజ్ఞప్తులను పరిష్కరించాలని కోరారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఆహ్వనం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యం యస్ యం ఈ, సెర్ప్, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజులు పాటు జరిగిన ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు గురువారం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నివసించే భారతీయ మూలాలున్న వారందరినీ ఏకం చేయడంతో పాటు ఆయా దేశాల్లో భారతీయ సంతతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగింది.
ఈ సందర్భంగా భువనేశ్వర్ లో కేంద్ర విదేశీ వ్యవహార శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ను ఆయన విడిది కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెండింగ్లో ఉన్న సమస్యలపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వలస వనరుల కేంద్రం మంజూరు కోసం విజ్ఞాపన చేయడం జరిగిందని, సత్వరమే రాష్ట్రంలో “వలస వనరుల కేంద్రం” మరియు “విదేశీ భవన్” మంజూరు చేయాలని మంత్రి శ్రీనివాస్ అభ్యర్థించారు. దీనిపై స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “వలస వనల కేంద్రాన్ని” త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజెతో సమావేశమయ్యారు. సూక్ష్మ చిన్న మద్యతరహ పరిశ్రమల శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ పథకాలను అత్యధికంగా మంజూరు చేసి రాష్ట అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందించాలని మంత్రి అభ్యర్థించారు. మంత్రి శ్రీనివాస్ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి శోభాకరంద్లాజె రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.