-ప్రభుత్వ కళాశాలల్లో 162.. ప్రైవేటు కళాశాలల్లో 262 సీట్లు పెంపు
-2026–27లో మొత్తం 424 సీట్లు అదనం
-నవంబరు మూడో వారంలో రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్
-ఇందులో కొత్తగా మంజూరైన సీట్లను కలుపుతామని విశ్వవిద్యాలయం వెల్లడి
-2024–25తో పోలిస్తే 2026–27లో 908 సీట్లు అదనం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత విలువైన పీజీ వైద్య సీట్లు రాష్ట్రంలో మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. 2026–27 విద్యా సంవత్సరానికి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతులతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కొత్తగా 424 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పీజీ వైద్య సీట్ల సంఖ్య 4,196కు చేరింది. కొత్తగా పెరిగిన 424 సీట్లలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు 162, ప్రైవేటు కళాశాలలకు 262 చొప్పున ఉన్నాయని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వెల్లడించింది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య 1,915 నుంచి 2,077కు పెరిగింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1,857 నుంచి 2,119కు చేరింది. ప్రస్తుతం పీజీ వైద్య సీట్ల తొలి విడత కౌన్సెలింగ్ కొనసాగుతుండగా.. రెండో విడత కౌన్సెలింగ్ నవంబరు మూడో వారంలో జరిగే అవకాశం ఉందని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఆ సమయంలో ఎన్ఎంసీ తాజాగా మంజూరు చేసిన సీట్లను కూడా కౌన్సెలింగ్లో కలిపి అందుబాటులోకి తీసుకువస్తామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వెల్లడించారు.
పీజీ వైద్య విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే సీట్ల పెంపు విద్యార్థులకు కీలకమైన పరిణామం. వైద్య పట్టా పొందిన అనంతరం తమకు ఆసక్తి ఉన్న వైద్య విభాగంలో ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు పీజీ విద్య దోహదపడుతుంది. అందుబాటులోకి వచ్చే అదనపు సీట్లు పీజీ వైద్య విద్యలో ప్రవేశ అవకాశాలను విస్తరించనున్నాయి.
మెరిట్ విద్యార్థులకు సువర్ణావకాశం
గత మూడేళ్లలో రాష్ట్రంలో పీజీ వైద్య సీట్ల సంఖ్య 3,288 నుంచి 4,196కు పెరిగింది. 2025–26 విద్యా సంవత్సరంలో 484 సీట్లు పెరగగా.. 2026–27లో మరో 424 సీట్లు అదనంగా వచ్చాయి. మొత్తంగా 2024–25తో పోలిస్తే 2026–27లో 908 సీట్లు పెరిగాయి. ఇందులో 2025–26లో ప్రభుత్వ వైద్య కళాశాలలకు 151, 2026–27లో 162 చొప్పున పీజీ సీట్లు వచ్చాయి. మిగిలిన సీట్లు ప్రైవేటు కళాశాలలకు వచ్చాయి. సీట్ల పెరుగుదలతో మెరిట్ విద్యార్థులకు రాష్ట్రంలో పీజీ వైద్య విద్యా అవకాశాలు గణనీయంగా విస్తరించాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేటు వైద్య కళాశాలలు కలిపి మొత్తం 36 కళాశాలల్లో పీజీ వైద్య విద్య అందుబాటులో ఉంది. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఈ జాబితాలో చేరింది. మొత్తం ప్రభుత్వ కళాశాలల్లో 2,077, ప్రైవేటు కళాశాలల్లో 2,119 పీజీ సీట్లు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 4,196 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
