మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మార్పు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించిన ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026’ ముగింపు కార్యక్రమం శనివారం మంగళగిరి ఎకో పార్కులో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కాంతిలాల్ దండే మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 660 మండలాల్లో స్వచ్ఛ రథాల ద్వారా పొడి వ్యర్థాల సేకరణ చేపడుతున్నామని, గ్రీన్ షాపులు, వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఏపీపీసీబీ చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య మాట్లాడుతూ, నీరు, విద్యుత్ ఆదా చేయడం, ప్లాస్టిక్ సంచులకు బదులుగా జూట్ బ్యాగులు వినియోగించడం, ఆహార వృథాను అరికట్టడం వంటి చిన్న చిన్న అలవాట్లే పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. బోర్డు ఆధ్వర్యంలో నాలుగు వేల కార్యక్రమాలు నిర్వహించగా, రెండు లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు.
పీసీసీఎఫ్ డాక్టర్ పి.వి. చలపతిరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్య శతాబ్ది నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యమని, 2028 నాటికి 80 శాతం గ్రామాలు, పట్టణ స్థానిక సంస్థల్లో మిషన్ లైఫ్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
అనంతరం విద్యార్థులు, అధికారులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించి, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను అధికారులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
