Breaking News

మన రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి… 


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య సమరయోధులు అందించిన స్వాతంత్ర్య ఫలాల స్ఫూర్తితో మన రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో బుధవారం జరిగిన భారత గణతంత్ర వేడుకలలో జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని, ప్రజల శ్రేయస్సు మరియు సంతోషం కోసం రాష్ట్రాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. అభివృద్ధి ఫలాలు కొందరికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాల మధ్య సమానంగా పంపిణీ జరగాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విధానమని, నవరత్నాల పథకాలతో కుల, మత , రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన , సుస్థిర అభివృద్ధి సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 95 శాతం హామీలను నెరవేర్చిందని, . ప్రభుత్వం గత 32 నెలల కాలంలో నగదు బదిలీ పధకం మరియు నాన్ డీబీటీ పధకం ద్వారా 9 కోట్ల 29 లక్షల 15 వేల 170 మంది లబ్ధిదారులకు లక్షా 67 వేల 798 కోట్ల రూపాయలను అందించిందన్నారు. ఇందులో నగదు బదిలీ పధకం ద్వారా 6కోట్ల 80 లక్షల 62 వేల 804 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,27,173 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం నేరుగా జమ చేయబడిందని, మరియు నాన్ డిబిటి పధకం కింద 2 కోట్ల 48 లక్షల 52 వేల 366 మందికి 40 వేల 625 కోట్ల రూపాయలను లబ్దిదారులకు అందించిందన్నారు.
వ్యవసాయానికి రైతు సంక్షమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్ర జనాభాలో 62 శాతంనకు పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగు యంత్రాలు సబ్సిడీ అందించి, సాగుకు అవసరమైన అన్ని అంశాలలో రైతుకు పూర్తి సేవలు అందించేందుకు రాష్ట్రంలో 10 వేల 778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడమైనదన్నారు. విత్తనం నాటిన దగ్గర నుండి పంటను మద్దతు ధర అందించేంత వరకు రైతుకు అన్ని సమయాలలోనూ రైతు భరోసా కేంద్రాలు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు రైతుల నుండి 35 వేల 396 కోట్ల రూపాయల విలువైన 1. 91 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నికనీస మద్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అంతేకాక 86 వేల 313 కోట్ల రూపాయలను వ్యవసాయం, అనుబంధ రంగాల రైతులకు వివిధ పధకాల కింద అందించడం జరిగిందన్నారు. రైతు భరోసా పధకం కింద ఏడాదికి 13 వేల 500 రూపాయలు చొప్పున ఇంత వరకు 19 వేల 126 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని పంపిణి చేయడం జరిగినన్నారు. లక్ష రూపాయలలోపు రుణాలను నిర్దేశించిన గడువులో చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ పధకం కింద 1218 కోట్ల రూపాయలను అందించామన్నారు. అదేవిధంగా వై.ఎస్.ఆర్. ఉచిత పంటల భీమా అమలు చేస్తున్నామని, ఇన్పుట్ సబ్సిడీ కింద 13. 96 లక్షల మంది రైతులకు 1071 కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి అమూల్ పాల వెల్లువ పధకం అమలు చేస్తున్నామన్నారు.
భావి తరాల వారి ఉజ్జ్వల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరచడమనే లక్ష్యంగా రాష్ట్రంలో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. విద్యాభివృద్ధికి 34 వేల 619 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు. మన బడి – నాడు-నేడు కార్యక్రమం కింద 16 వేల 25 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలోని 56 వేల 703 ప్రభుత్వ పాఠశాలలను మూడు దశలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా ప్రమాణాల స్థాయిని పెంచేవిధంగా రూపుదిద్దుతున్నామన్నారు. మొదటి దశలో 3 వేల 669 కోట్ల రూపాయలతో 15 వేల 715 పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. జగనన్న అమ్మఒడి పధకం కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా 15 వేల రూపాయలు అనిస్తున్నామని, అమ్మఒడి పధకం కింద ఇంట వరకు 44. 48 లక్షల మంది తల్లుల ఖాతాలకు 13 వేల 23 కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. , ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థినీ, విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పధకం కింద ఫీజు రీయింబర్సుమెంట్, హాస్టల్ ఫీజు చెల్లిస్తున్నామన్నారు. జగనన్న విద్యా దీవెన పధకం కింద ఇంతవరకు 21. 55 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు 6 వేల 260 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన పధకం కింద 18. 77 లక్షల మందికి 2 వేల 305 కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతోపాటు, విద్యార్థుల నమోదు కూడా గణనీయంగా పెరుగుతున్నదన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులను నాడు-నేడు కార్యక్రమం ద్వారా 16 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజల వద్దకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో 10 వేల 32 వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక వైద్య ఆరోగ్య శాఖలో 14 వేల 391 పోస్టుల భర్తీ చేశామన్నారు. డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పధకం కింద నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్నామన్నారు. ఆరోగ్య ఆసరా కార్యక్రమం కింద శస్త్ర చికిత్స అనంతరం వారి జీవనోపాధికి రోజుకు 225 రూపాయలు చొప్పున భృతి అందిస్తున్నామని, ఈ పథకంకింద ఇంతవరకు 6. 77 లక్షల మందికి 445 కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రాష్ట్రంలో తీసుకున్న చర్యలతో పెద్ద ఎత్తున మరణాలను నివారించామన్నారు. అదేవిధంగా కోవిడ్ థర్డ్ వేవ్ ను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధులమై ఉన్నామని, ఎక్కడా మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా పాలనా యంత్రంగం చర్యలు తీసుకున్నదన్నారు. రాష్ట్ర జనాభాలో 93 శాతం మంది ప్రజలకు వాక్సినేషన్ పూర్తి చేశామన్నారు.
మహిళా సంక్షేమంలో భాగంగా వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ రాయితీ కింద ఇంతవరకు 2 వేల 354 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, వై.ఎస్.ఆర్ ఆసరా పధకం కింద 78. 74 లక్షల డ్వాక్రా సంఘ సభ్యులకు 12 వేల 758 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగిందన్నారు. వై.ఎస్.ఆర్. చేయూత పధకం కింద 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలకు సంవత్సరానికి 18 వేల 750 రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలలో 75 వేల రూపాయలు అందించే దిశలో ఇంతవరకు 25. 08 లక్షల మంది మహిళలకు 9 వేల 308 కోట్ల రూపాయలు అందించామన్నారు.
వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక కింద రాష్ట్రం లోని 62 లక్షల మంది అవ్వా, తాతలకు 45 వేల 837 కోట్ల రూపాయలు అందించామన్నారు. గత జనవరి,1వ తేదీ నుండి నెలకు 2500 రూపాయలు చొప్పున పెన్షన్ అందిస్తున్నామన్నారు. గ్రామ/వార్డ్ సచివాలయాలు ద్వారా ప్రతీ నెల 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ అందిస్తున్నామన్నారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, పారిశ్రామికాభివృద్ధి లో భాగంగా ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు 2 వేల 29 కోట్ల రూపాయల మేర ప్రోత్సహక సబ్సిడీలను అందించామన్నారు. 25 వేల కోట్ల రూపాయలతో 75 వేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పించే వై.ఎస్.ఆర్. జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. అదే విధంగా 10 వేల కోట్ల రూపాయలతో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే , వై.ఎస్.ఆర్. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో ఆర్ధిక పరిస్థితులు అనుకూలించని పరిస్థితులలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐ.ఆర్. ఇచ్చిందన్నారు. అంతేకాక పి .ఆర్.సి. మంజూరు చేసి, ఉద్యోగుల పదవీకాలాన్ని 62 సంవత్సరాలకు పెంచిందన్నారు. పేదలందరికీ ఇళ్ళు పధకం కింద రాష్ట్రంలోని షుమారు 32 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించడం జరిగిందని, వాటిలో సుమారు 30 లక్షల మంది లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయంతో స్వంత ఇల్లు నిర్మించుకుంటున్నారన్నారు. ఇందుకు 17 వేల జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణానికి 32 వేల 909 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నదన్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద 52 లక్షల మంది లబ్దిదారులకు వారు నివసించే గృహంపై పూర్తి హక్కులు కల్పిస్తున్నామని, వారి ఇళ్ల రిజిస్ట్రేషన్ కు స్టాంప్ డ్యూటీ కూడా మినాయింపు ఇస్తున్నామన్నారు.
రాష్ట్రంలో గ్రామ/వార్డ్ సచివాలయాలు వ్యవస్థ గ్రామ స్వరాజ్య సాధన దిశగా సాగుతున్నదన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటివద్దకు అందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థ ఎంతో సత్ఫలితాలను ఇస్తున్నదన్నారు.
ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మన యువ ముఖ్యమంత్రి చైతన్యవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశలో కొనసాగుతుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ , రాష్ట్ర మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్సులు, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *