Breaking News

సీమ వరద బాధితుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యంపై సీపీఐ సమరనాదం…

-ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో ఎన్నడూ లేని విధంగా కుర్సిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజానీకాన్ని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై భారీస్థాయిలో ఉద్యమించాలని సీపీఐ నిర్ణయించింది. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు దశలవారీ పోరుతో ఈ ఆందోళనను ఉదృతం చేయాలని తీర్మానించింది. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని జాతీయస్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించింది. తొలుత గ్రామ సచివాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని,తర్వాత కలెక్టరేట్‌ల ముట్టడి,రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, సదస్సులు వంటి కార్యక్రమాలు చేపట్టాలని భావించింది. ఫిబ్రవరి 20వ తేదీ అనంతపురంలో 5 జిల్లాల స్థాయిలో భారీ సదస్సు నిర్వహించి, ఈకార్యక్రమానికి అన్ని వామపక్ష, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించాలని, చివరిగా విజయవాడకు చలో సెక్రటేరియట్‌ కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించేందుకు పార్టీ సమాయత్తమైంది. శనివారం రాయలసీమ ప్రాంతంలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లా సీపీఐ, అనుబంధ సంఘాల నేతలతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ చంద్రం బిల్డింగ్స్‌ నుండి ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్‌ మూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, జల్లి విల్సన్‌, జి.ఓబులేసు, ఆయా జిల్లాల సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయా జిల్లాల్లో ఇటీవల వర్షాలు,వరదల వల్ల జరిగిన నష్టం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యల్లో వైఫల్యం చెందడం వంటి అంశాలపై ఈసమావేశంలో చర్చించి, బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ సీమ జిల్లాల్లో ఘోర విపత్తు సంభవించి నాలుగు నెలలు దాటినా పాలకులు ఇంతవరకు బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలన్నీ నీట మునిగి, కొట్టుకుపోయి దాదాపు రూ.1000కోట్ల పైన నష్టం వాటిల్లిందని, ఇక ఆస్థి నష్టమైతే అంచనాలకందని పరిస్థితి ఉందన్నారు. కేంద్ర బృందాలు ఈ పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత కూడా కనీసం స్పందించకపోవడం, రాష్ట్ర ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. ఇక ఈ విషయంపై కేంద్రానికి వెయ్యి కోట్ల తక్షణ సహాయం కావాలని కోరుతూ లేఖ రాసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సైతం, బాధితులను ఆదుకునే చర్యలు చేపట్టకుండా తాత్కాలిక సహాయక చర్యలతో చేతులు దులుపుకోవడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమేనన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని, ఇందుకోసం పార్టీ శ్రేణులు బాధితులకు న్యాయం జరిగే వరకు దశలవారీ పోరు కొనసాగించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రస్తుతం పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి కూడా సీపీఐ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలవాలని కోరారు. దీనిపై ఫిబ్రవరి 1,2 తేదీల్లో అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించి సదస్సులు నిర్వహించి, వారిలో సీపీఐ అండగా ఉందనే భరోసా నింపాలని పిలుపునిచ్చారు. పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన అశుతోష్‌ కమిటీ నివేదికను వారికి అందజేయకుండా, దానిపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించకుండా గతంలో ఇచ్చిన ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ప్రకటించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి విడనాడి పీఆర్సీ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. అలాగే జిల్లాల విభజన ప్రక్రియకు సంబంధించి ప్రజల ఆకాంక్షలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఏఐకేఎస్‌ అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ సీమ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందాలు పరిశీలించినా, ముఖ్యమంత్రి లేఖ రాసిన తర్వాత కూడా, ఇంతవరకు కేంద్రం ఎటువంటి ఆర్థిక సహాయం అందజేయకపోవడం దుర్మార్గమన్నారు. పంట నష్టానికి ప్రధాని మంత్రి ఫసల్‌ బీమా పథకాన్ని వర్తింపజేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌ మాట్లాడుతూ సీమలో జరిగిన నష్టం రైతులకే కాకుండా వ్యవసాయ కూలీలకు కూడా కోలుకోలేని దెబ్బ అన్నారు. భారీస్థాయిలో జరిగిన పంట నష్టం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. కేంద్ర బృందాలు టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని విమర్శించారు. సీమ జిల్లాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని కోరారు. ఈసమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆవుల శేఖర్‌, రాయలసీమ జిల్లాల సీపీఐ నేతలు రామానాయుడు, రామాంజనేయులు, జగదీష్‌, గిడ్డయ్య, నర్సింహులు, నారాయణస్వామి, భీమయ్య, కాటమయ్య, ఎస్‌ఎఫ్‌ నేతలు శివారెడ్డి, జాన్సన్‌బాబు తదితరులు మాట్లాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *