-అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి: జీఎంసీ అదనపు కమిషనర్ ఐ. కిషోర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజల నుంచి అందిన అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ. కిషోర్ అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు సోమవారం జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసిన నేపథ్యంలో ఇకపై ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు నిర్ణీత సమయానికి కార్యక్రమానికి హాజరై, ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
పీజీఆర్ఎస్కు ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వీటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏవైనా సాంకేతిక లేదా ఇతర కారణాలతో అర్జీలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదురైతే, సంబంధిత విషయాన్ని దరఖాస్తుదారులకు స్పష్టంగా వివరించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించినా, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపకపోయినా సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్ హెచ్చరించారు.
ఈ సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో మొత్తం 16 అర్జీలు అందినట్లు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి 10, ఇంజినీరింగ్ విభాగానికి 4, ప్రజారోగ్య విభాగానికి సంబంధించి 2 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి. రవీంద్ర (ఎస్డబ్ల్యూ), సూపరింటెండింగ్ ఇంజినీర్ జి. వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, మేనేజర్ బాలాజీ బాషా తదితరులు పాల్గొన్నారు.
