రోగుల వైద్య సేవల్లో పల్నాడు జిల్లా అగ్రస్థానం

-అట్టడుగున కర్నూలు జిల్లా
-రాష్ట్రవ్యాప్తంగా 135 మంది వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు
-మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు నివేదించిన ప్రజారోగ్య సంచాలకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల పనితీరు మెరుగుపరచడంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 81.6 శాతం ప్రజాభిప్రాయాలతో పల్నాడు అగ్రస్థానంలో ఉండగా, 81.5 శాతంతో పోలవరం, 80.7 శాతంతో నెల్లూరు, 78.3 శాతంతో తిరుపతి, 77.5 శాతంతో కృష్ణా జిల్లాలు వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. గత జూలై నుంచి నవంబరు 7 వరకు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా రోగుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా వైద్యారోగ్య శాఖ జిల్లాల పనితీరును అంచనా వేసింది. వైద్యుల అందుబాటు, మందులు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలపై రోగులు వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు అక్టోబర్ నెలలో ఐవీఅర్ యస్ ద్వారా పొందిన సమాచారం మేరకు రోగులకు సేవలు అందించడంలో వెనుకబడిన పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన రాష్ట్రవ్యాప్తంగా 135 మంది వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ ఆర్‌.వెంకటరమణ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు నివేదించారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా రోగుల అభిప్రాయాలు, ఆసుపత్రుల పనితీరుపై మంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాల్లో ఐవీఆర్‌ఎస్‌ నివేదికల ఆధారంగా జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

అట్టడుగున కర్నూలు, అనంతపురం, ఎన్టీఆర్‌ జిల్లాలు

గడచిన ఐదు నెలల పనితీరు ఆధారంగా వెనుకబడిన జిల్లాల్లో కర్నూలు 69.5 శాతం, అనంతపురం 69.8 శాతం, ఎన్టీఆర్‌ జిల్లా 70.9 శాతం, అనకాపల్లి 71.5 శాతం, మార్కాపురం 71.8 శాతంతో ఉన్నాయి.

అక్టోబరు పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా 135 మంది వైద్యులకు నోటీసులు

అక్టోబరు నెలకు సంబంధించి వైద్యుల అందుబాటు, పారిశుద్ధ్యం, వైద్య సేవలకు డబ్బులు అడిగారా?, మందులు ఇచ్చారా? అనే నాలుగు అంశాలపై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా రోగుల అభిప్రాయాలను సేకరించారు. ఈ నాలుగు అంశాల కు సంబంధించి ఒక్కో అంశంలో 100 శాతం ప్రతికూల సమాధానo వచ్చిన రాష్ట్రంలో 135 మంది వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు డాక్టర్‌ ఆర్‌.వెంకటరమణ తెలిపారు.

ఉత్తమ పనితీరు కనబరిచిన తొలి 20 ఆరోగ్య కేంద్రాలు

గత నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరులో ఉత్తమ స్థానాలు సాధించిన వాటిలో అనంతపురం జిల్లా కుదేర్‌ పీహెచ్‌సీ, తరిమెల పీహెచ్‌సీ, శ్రీరంగాపురం, కంబదూరు, గార్లదిన్నె ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మాచవరం పీహెచ్‌సీ, కానూరు పీహెచ్‌సీ, ఏలూరు జిల్లాలో పి.ఎన్‌.కొలను, పి.ఆర్‌.గూడెం, కర్నూలు జిల్లాలో హర్దగేరి, పల్నాడు జిల్లాలో సిరిగిరిపాడు, ప్రకాశం జిల్లాలో కురిచేడు, నెల్లూరు జిల్లాలో జగదేవిపేట, చేజర్ల, శ్రీ సత్యసాయి జిల్లాలో సోమందిపల్లి, శ్రీకాకుళం జిల్లాలో కింతలి, తిరుపతి జిల్లాలో పాతకోట, లాసాగరం యూపీహెచ్‌సీలు, పాకాల పీహెచ్‌సీ, వైఎస్సార్‌ కడప జిల్లాలో తొండూరు పీహెచ్‌సీలు తొలి 20 స్థానాల్లో నిలిచాయి.

వెనుకబడిన ఆరోగ్య కేంద్రాలు

పనితీరులో వెనుకబడిన ఆరోగ్య కేంద్రాల్లో అనంతపురం జిల్లా గరుడచేడు, నంద్యాల జిల్లా బెయిర్లుటి, అనంతపురం జిల్లా జంగాల కాలనీ యూపీహెచ్‌సీ, వైఎస్సార్‌ కడప జిల్లా దువ్వూరు పీహెచ్‌సీ, శ్రీ సత్యసాయి జిల్లా వెంకలమ్మ చెరువు పీహెచ్‌సీలు ఉన్నాయి.