-విధులు ముగిశాక ఇతర ప్రాంతాల్లో తిరగకూడదు
-ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ ఆదేశాలు
-ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో భాగంగా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రోగులకు అంటువ్యాధులు వ్యాపించకుండా ఆపరేషన్ థియేటర్లు (ఓటీ), అత్యవసర చికిత్స విభాగాల (ఐసీయూ)లో విధులు నిర్వహించే వైద్యులు, పీజీ విద్యార్థులు, ఇంటర్న్లు, నర్సింగ్, ఇతర సిబ్బంది ప్రత్యేక దుస్తులను నిర్దేశిత ప్రాంతాలకే పరిమితం చేయాలని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు. విధులు ముగిసిన తర్వాత అదే దుస్తులతో సాధారణ వార్డులు, ఓపీడీలు, కారిడార్లు, కార్యాలయాలు, క్యాంటీన్లు, ఆసుపత్రి ప్రాంగణాల్లో తిరగకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో ఇప్పటి వరకు మౌఖికంగానే ఆదేశాలున్నాయి. కీలకమైన ఈ విధానం అమలుపై లిఖితపూర్వకంగా తొలిసారిగా ఆదేశాలిచ్చారు. ఓటీ, ఐసీయూల్లో ఉపయోగించే ప్రత్యేక దుస్తులతో ఇతర ప్రాంతాల్లో తిరగడం వల్ల సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉందని, ఆసుపత్రుల్లో వచ్చే ఇతర ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందని పేర్కొన్నారు.
నిర్దేశిత ప్రాంతాలకే పరిమితం
ఆపరేషన్ థియేటర్ సముదాయాలు, అన్ని ఐసీయూలు, ప్రసవ గదులు, క్యాథ్ ల్యాబ్‌లు, మార్పిడి చికిత్స విభాగాలు, సీసీఎస్డీ స్టెరైల్ జోన్లలో మాత్రమే ప్రత్యేక దుస్తులు ధరించాలి. సాధారణ వార్డులు, ఓపీడీలు, కారిడార్లు, లిఫ్టులు, వేచి ఉండే ప్రాంతాలు, కార్యాలయాలు, గ్రంథాలయాలు, క్యాంటీన్లు, వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఆసుపత్రి ప్రాంగణం వెలుపల వీటిని ధరించకూడదు. నిర్దేశిత ప్రాంతాల్లోకి ప్రవేశించే సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించాలి. బయటకు వచ్చేటప్పుడు వాటిని తొలగించాలి. టోపీలు, మాస్కులు, షూ కవర్లను బయటకు వెళ్లే ముందు తొలగించాలి. ఓటీ, ఐసీయూలకు కేటాయించిన పాదరక్షలను ఇతర ప్రాంతాల్లో ధరించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రత్యేక దుస్తులపై శుభ్రమైన, శరీరాన్ని పూర్తిగా కప్పే గౌన్ లేదా కోటు ధరించాలి. తిరిగి లోపలికి వెళ్లేటప్పుడు కొత్త ప్రత్యేక దుస్తులు ధరించాలి.
ఆసుపత్రి లాండ్రీలోనే శుభ్రం చేయాలి
ఆసుపత్రి పర్యవేక్షకులు తగిన సంఖ్యలో ప్రత్యేక దుస్తులను అందుబాటులో ఉంచాలి. ఓటీ, ఐసీయూలకు వేర్వేరు రంగుల దుస్తులు కేటాయించాలని సూచించారు. వీటిని ఆసుపత్రి లాండ్రీ ద్వారానే శుభ్రం చేయాలి. ప్రతి ఓటీ, ఐసీయూ ప్రవేశద్వారం వద్ద పురుషులు, మహిళలకు వేర్వేరు దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలి.
ఆకస్మిక తనిఖీలు.. ఉల్లంఘనలపై చర్యలు
ప్రతి బోధనాసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాల అమలుకు బాధ్యత వహించాలి. ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనల ఉల్లంఘనలను నమోదు చేయాలి. మొదటిసారి ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఘటనను నమోదు చేయాలి. పదేపదే ఉల్లంఘిస్తే ప్రిన్సిపాల్ లేదా సూపరింటెండెంట్‌కు నివేదించి నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో డీఎంఈ స్పష్టం చేశారు.
