-గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది*
-విశాఖ సీఐఐ సదస్సు కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
-మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి
-విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ సదస్సు ఏర్పాట్లపై విశాఖ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో సమీక్ష నిర్వహించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి డిఎస్ బీవీ స్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సీఐఐ సదస్సు ఏర్పాట్లపై విశాఖ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో సోమవారం అమరావతి నుంచి జామ్ వేదికగా మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు మంత్రి పలు సూచనలు చేశారు. అందరూ సమన్వయంతో పనిచేసి సదస్సును విజయవంతం చేయాలన్నారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….సీఐఐ సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ , ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్’ థీమ్‌తో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు సుమారు 59 దేశాల నుంచి ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు హాజరవుతారు, మొత్తం 1,250 మందికి పైగా దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, సీఈఓలు, పాలసీ మేకర్లు హాజరవుతారు. వాణిజ్యం, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం కంప్యూటింగ్, టెక్నాలజీ ఇన్నోవేషన్, ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి ఆరు కీలక రంగాలపై సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయని మంత్రి తెలిపారు. వైసిపి పార్టీ హయాంలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని నేడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర సమగ్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
