-ఏడేళ్లుగా ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం
-రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ సమాధానం చెప్పాలి
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో భాగంగా డివిజన్ పర్యటనలు నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1 వ డివిజన్ తుంగారాముల వీధి, వెంకటేశ్వర నగర్లలో వైసీపీ కార్పొరేటర్లు ఉద్ధంటి సునీత, కొంగితల లక్ష్మీపతితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు కావాలని వార్డు సచివాలయ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కార్పొరేటర్లు నిత్యం ప్రజాక్షేత్రంలో పర్యటించాలని సూచించారు. గుణదల ప్రాంతంలో మంజూరైన రెండు నూతన వంతెనలకు టెండర్లు పిలవడం జరిగిందని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మల్లాది విష్ణు తెలిపారు. పప్పుల మిల్లు వద్ద మంజూరైన మరో వంతెనకు త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. నూతన పోలీస్ స్టేషన్ ను సైతం త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం పదే పదే వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ ముద్దాయిలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సరిగా చేయలేదని ప్రధాని అనడం నిర్వర్తించవలసిన బాధ్యతల నుంచి తప్పించుకోవడమేనని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రత్యేక హోదా, పోలవరం సహా విభజన హామీలన్నీ అమలు చేయవలసిన అవసరం ఉందన్నారు. టీడీపీ చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలను శిక్షించడం తగదన్నారు. ప్రత్యేక హోదా న్యాయంగా రాష్ట్ర ప్రజలకు నెరవేర్చాల్సిన హామీ అని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న వారిలో ప్రథమ ముద్దాయి చంద్రబాబు అయితే.. రెండో ముద్దాయి బీజేపీ అని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడున్నరేళ్లు గడిచినా విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోగా.. తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కరించవలసిన అంశాలపై కనీసం దృష్టి సారించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై డిమాండ్ చేస్తున్నా.. పెడచెవిన పెడుతూ వస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇవ్వాలని తిరుపతి వెంకన్న సాక్షిగా ఆనాడు మాట్లాడిన మాటలన్నీ ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించి.. రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని మల్లాది విష్ణు అన్నారు. ఇకనైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలను, ఆకాంక్షలను కేంద్రం గుర్తించాలని సూచించారు. లేకుంటే రాష్ట్రంపై చూపుతున్న వివక్షకు ప్రజలే సరైన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, బండి వేణు, చంద్రలీల, రమణి, తుంగం ఝాన్సీ, కొంగితల శివ, లక్ష్మి, వీఎంసీ ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, జోనల్ కమిషనర్ రాజు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.