-గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గోపూజ ముక్కోటి దేవతల పూజా ఫలంతో సమానమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని సత్యనారాయణపురం జి.ఎస్. రాజు రోడ్డు నందు గోకులం ఆధ్వర్యంలో జరిగిన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గోమాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ ధర్మంలో గోమాతకు తల్లి స్థానం ఇచ్చారనీ.. అందుకే గోవును గోమాత అంటారన్నారు. సకల దేవతా స్వరూపాలైన గోవులను రక్షించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. గోమాత విశిష్టతను ప్రజలందరికీ తెలియచేసేందుకు గుడికో గోమాత కార్యక్రమం చేపట్టి.. నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కనుక గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మ రక్షణ కోసం టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమానికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని కోరారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన ఇంటి వద్ద ఇటీవల గోశాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గోవుల ప్రాశస్త్యంను గుర్తించి, గోపూజ కార్యక్రమానికి ప్రాముఖ్యతనిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి ఈ సందర్భంగా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మైలవరపు రాము, యల్లాప్రగఢ సుధీర్ బాబు, కొల్లూరు రామకృష్ణ, జె.కె.సుబ్బారావు, శనగవరపు శ్రీనివాస్, కొప్పరపు మారుతి, కోలవెన్ను కొండ తదితరులు పాల్గొన్నారు.