-టైలర్స్ డే వేడుకలలో పాల్గొని దర్జీ సోదరసోదరీమనులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేద టైలర్ల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. ముత్యాలంపాడులోని శ్రీ గోకరాజు గంగరాజు కళ్యాణవేదికలో నవ్యాంధ్ర విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 34 వ టైలర్స్ డే వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత కుట్టుమిషన్ల సృష్టికర్త విలియమ్స్ ఒవె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టైలర్స్ నుద్దేశించి ప్రసంగించారు. విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో అసోసియేషన్ లో అత్యధికంగా మహిళలకు ప్రాధాన్యతను కల్పించడం అభినందనీయమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దర్జీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తొలి జీవో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో టైలర్స్ జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ‘జగనన్న చేదోడు’ పథకం ద్వారా దర్జీలను ఆర్థికంగా ఆదుకున్నారని వ్యాఖ్యానించారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 1,692 మంది టైలర్స్ సోదరసోదరీమణులకు చేదోడు పథకం ద్వారా రూ. 10 వేలు అందించడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా అభ్యర్థనలు ఉంటే అర్జీ రూపంలో సమర్పించాలని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి టైలర్స్ సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాన్ని అందిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ వీనస్ బాబు, వైస్ ప్రెసిడెంట్ కె.బి.రాజు, కోశాధికారి అనిల్ కుమార్, గౌరవ అధ్యక్షులు మస్తాన్ వలి, పాలకవర్గ సభ్యులు అఫ్రోజ్, ఆసిఫ్, లతిఫ్, రమా తదితరులు పాల్గొన్నారు.