విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలా అండదండగా నిలుస్తూ.. పూర్తి భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వరల్డ్ విజన్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలస్ నందు దివ్యాంగ చిన్నారులకై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కన్సల్ టెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన వరల్డ్ విజన్ ఇండియా సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. నేటి సమాజంలో దివ్యాంగులు అన్ని రంగాలలో సాధారణ వ్యక్తులతో సమానంగా రాణిస్తున్నారని.. అదే పట్టుదలతో జీవితాన్ని ధైర్యంగా ముందుకు సాగించాలని మల్లాది విష్ణు అన్నారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే దివ్యాంగులకు నెలవారీ పెన్షన్ ను రూ.3 వేలకు పెంచినట్లు మల్లాది విష్ణు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2,423 మంది దివ్యాంగులకు ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవేగాక డిగ్రీ, పీజీ, వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న విభిన్న ప్రతిభావంతులకు జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజీ ఫీజు పూర్తిగా తిరిగి చెల్లించడం జరుగుతోందని మల్లాది విష్ణు చెప్పారు. వసతి దీవెన ద్వారా ఐ.టి.ఐ. చదువుతున్న వారికి రూ. 10 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి రూ. 15 వేలు, డిగ్రీ, పి.జి., ఆ పై ఉన్నత చదువులు చదివే వారికి రూ. 20 వేలు భోజన మరియు మెస్ ఫీజుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. వీటితో పాటుగా డిగ్రీ, పీజీ లేదా వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు కూడా మంజూరు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన దివ్యాంగులకు అవసరమయ్యే ఉపకరణాలు అందించేందుకు ఇటీవల సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం ఉన్నత పాఠశాలలో పెద్దఎత్తున ఒక శిబిరాన్ని కూడా నిర్వహించినట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా దివ్యాంగ బాలబాలికలకు వీల్ చైర్స్ అందజేశారు. కార్యక్రమంలో నగరపాలక క్రీడలు మరియు ట్రాఫిక్ కమిటీ చైర్ పర్సన్ పెనుమ్సత శిరీష సత్యం, డిప్యూటీ డీ.ఎం.హెచ్.ఓ. ఇందుమతి, డి.సి.పి.ఓ. జాన్సన్, APCRAF డైరక్టర్ ఫ్రాన్సెస్ తంబి, వరల్డ్ విజన్ ఇండియా సీనియర్ మేనేజర్ తబితా ఫ్రాన్సెస్, నేషనల్ కోఆర్డినేటర్ జాకోబ్, ADP మేనేజర్ జోషిబాబు తదితరులు పాల్గొన్నారు.