-పరిశ్రమల సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం – కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజల నుంచి అందుతున్న కాలుష్య సంబంధిత ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపడంతో పాటు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య నిర్ణయించారు.
ఈ మేరకు గురువారం విజయవాడలోని ఏపీపీసీబీ ప్రధాన కార్యాలయంలో ఆయన అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదులు, పారిశ్రామిక సంస్థల సమస్యలు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వస్తున్న పారిశ్రామిక కాలుష్య ఫిర్యాదులు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ పరిశ్రమల నుంచి వెలువడే వాయు, జల కాలుష్య నియంత్రణ, పర్యావరణ నిబంధనల అమలు, పారిశ్రామిక వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, మురుగునీటి శుద్ధి వ్యవస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గాలి, నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు పరిశ్రమలకు జారీ చేసే అనుమతులు, కాలుష్య నియంత్రణ పరికరాల నిర్వహణను సమీక్షించాలని తెలిపారు.
ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఈటీపీ), మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ), కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (సీఈటీపీ) పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక డ్రైవ్లో భాగంగా అందిన ఫిర్యాదులు, సమస్యల తీవ్రత ఆధారంగా పరిశ్రమలకు ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టి పర్యావరణ ప్రమాణాల అమలును సమీక్షించాలని, గుర్తించిన లోపాలపై తగిన చర్యలు తీసుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పరిశ్రమలు పర్యావరణహిత విధానాలను అవలంబించేలా ప్రోత్సహించాలని క్రిష్ణయ్య పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే పర్యావరణ సమతుల్యతను కాపాడటం, ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు అందించడం లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఎం. రాజశేఖర్, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ శ్రీరంజనీ, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్లు నరేంద్రబాబు, సాయినాథ్తో పాటు వివిధ జోనల్, ప్రాంతీయ అధికారులు పాల్గొన్నారు.
