-ఉదయం 09.30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు..
-జిల్లాలో 28,680 మంది రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థుల హాజరు…
-176 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు….
-176 మంది చీఫ్ సూపరింటెండెంట్లు నియామకం..
-1500 మందికి పైగా ఇన్విజిలేటర్లు నియామకం..
-ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు..
-కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు.
నగరంలోని కలెక్టర్ బంగ్లా నుండి శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు విద్య, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, నగరపాలక సంస్థ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుండి మే తొమ్మిదో తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను పక్కాగా నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 28,680 మంది రెగ్యులర్, ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షల నిర్వహణ కై 176 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 09.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటలవరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. వేసవి దృష్ట్యా త్రాగునీరు తదితర ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా సబ్ ఇన్స్ పెక్టర్ స్థాయి పోలీసు అధికారి, రెవెన్యూ, విద్యాశాఖకు చెందిన అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షించాలన్నారు. పరీక్షలు జరిగే సమయాలలో విద్యుత్ కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవసరమైన మందులతో వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకునే విధంగా ఆయా కేంద్రాల రూట్లలో బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి జిరాక్స్ సెంటర్లు తెరచి ఉండకుండా, పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలును పర్యవేక్షించే అందంగా బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని ఇందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ప్రతీ అధికారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా అమలు చేస్తూ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు.
జూమ్ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ కె. మోహన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి.రేణుక, కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి తహీరా సుల్తానా ఉన్నారు.