విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిభా ఫూలే 192 వ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ హౌస్ లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిధిగా ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి మరియు సంస్థ ఎండీ సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, IPS పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం జ్యోతిభాఫూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) ఏ. కోటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఆర్టీసీ హౌస్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ జ్యోతిభా ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. సమాజంలో మహిళలు విద్యావంతులు కావాలని, అప్పుడే సమాజంలో వివక్ష తొలిగిపోతుందని నమ్మి ఆయన ఎంతో పోరాటం చేసారన్నారు. వితంతు వివాహాల మీద తిరుగుబాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆ రోజుల్లోనే అంటే 19వ శతాబ్దంలోనే ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసారన్నారు. గొప్ప పనులు చేసే వారినే మహాత్ములుగా భావిస్తామని అందుకే ఆయన మహాత్మగా కీర్తించబడ్డారన్నారు. ఆయన నేర్పిన విలువలు, సంస్కరణలు పాటించగల్గితే సమాజంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయన్నారు. ఆర్టీసీ లో సందర్భం కాకపోయినా గాని ఒక విషయం చెప్తున్నానని, ఈ రోజు క్యాబినెట్ లో కూడా అన్ని కులాల వారికి సమాన ప్రాతిపదిక కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారిదని ఛైర్మన్ శ్రీ మల్లికార్జున రెడ్డి వ్యాఖ్యానించారు.
సంస్థ ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. జ్యోతిభా ఫూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి(ఆపరేషన్స్), ఫైనాన్షియల్ అడ్వైజరు రాఘవరెడ్డి లు కూడా పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) ఏ. కోటేశ్వర రావు మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దాలని పరితపించిన మహానుభావుల్లో ఫూలే మొదటి వ్యక్తని, ప్రతి ఒక్కరికి విద్య అందించాలని ముఖ్యంగా స్త్రీలు చదువుకుని విద్యావంతులైతే సమాజంలో ఎన్నో మార్పులు వస్తాయని పాటుపడిన మహానీయుడన్నారు. సమాజాన్ని చదవడం ద్వారా ప్రతి ఒక్కరు వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకోగలరన్నారు. మహనీయుల ఆలోచనలను అనుసరిస్తూ వారు మనకి అందించిన స్వేచ్చ,సమానత్వాన్ని పాటించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, బి.సి. వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు వారి వారి సందేశాలను అందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటి సి.పి.ఎం.(హెచ్.ఆర్.డి.) సామ్రాజ్యం, పి.ఓ.(హెచ్.ఆర్.డి.) తిరుపతి మరియు ఆర్టీసీ హౌస్ ఈడీలు, అధికారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.