-కాకాని వెంకట రత్నం విగ్రహ పునరుద్ధరణకు డిమాండు
-కలెక్టర్ ఢిల్లీరావుకు కాకాని ఆశయ సాధన సమితి వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెంజ్ సర్కిల్లో కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునరుద్ధరించాలని కాకాని ఆశయ సాధన సమితి డిమాండు చేసింది. కొత్తగా ఏర్పాటయిన ఎన్.టి.ఆర్. జిల్లాకు మకుటాయమానంగా నిలిచే ఆంధ్ర ఉక్కు మనిషి, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు తరుణ్ కాకాని కోరారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును కలెక్టరేట్ లో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆంధ్ర ఉక్కు మనిషిగా పేరుగాంచిన కాకాని విగ్రహాన్ని గతంలో బెంజ్ సర్కిల్ వద్ద తొలిగించారు. ఆ సమయంలోనే కాకాని ఆశయ సమితి ప్రతినిధులు నిరసన తెలిపారు. కానీ అప్పట్లో ప్రభుత్వం స్పందించలేదు. ఇపుడు తాజాగా ఎన్.టి.ఆర్. జిల్లా ఏర్పడిన సందర్భంగా, వై.ఎస్. జగన్ ప్రభుత్వం బెంజ్ సర్కిల్ వద్ద కాకాని వెంటరత్నం విగ్రహాన్నిపునరుద్ధరించాలని డిమాండు చేశారు. బెంజ్ సర్కిల్ ని కాకాని సర్కిల్ గా నామకరణం చేయాలని తరుణ్ కాకాని డిమాండు చేశారు. బెంజ్ సర్కిల్ వద్ద కాకాని వెంకటరత్నం విగ్రం పునరుద్దరణకు అవసరమయ్యే ఖర్చును కాకాని ఆశయ సాధన సమితి భరిస్తుందని తరుణ్ కాకాని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుకు వివరించారు