అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పినిపె విశ్వరూప్ మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో కేటాయించిన ఛాంబరుకు సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో వేదమంత్రాల మధ్య షోడషోపచారలతో మంత్రి దంపతులు ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రి ఆసీనులు అయ్యారు. అనంతరం రవాణా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులతో పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమసుమాంజలిలు తెలియజేస్తున్నానన్నారు. రాష్ట్రంలో దాదాపు 11,271 బస్సులు తిరుగుతున్నాయని, అయితే ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 998 బస్సులను కొత్తగా అద్దెకు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. తిరుమలలో ఎటు వంటి కాలుష్యం లేకుండా ఆ పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడాలనే ఉద్దేశ్యంతో కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే తీసుకోవడం జరిగిందన్నారు. తిరుమలలో తొలి బస్సును ఏప్రిల్ 30 న ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, అయితే మే 15 న తొలి ఎలక్ట్రిక్ బస్సు తిరుమలకు చేరుకోబోతున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అనుమతితో వారి చేతుల మీదుగా ఆ తొలి ఎలక్ట్రిక్ బస్సును శ్రీవారి సన్నిధిలో ఉంచడం జరుగుతుందని, ముఖ్యమంత్రితో మాట్లాడిన తదుపరి ఆ తేదీని కూడా త్వరలో ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రయాణీకుల భద్రతకై కేంద్రప్రభుత్వ సహకారంతో రహదారి భద్రతా ప్రమాణాల ప్రకారం రూ.380 కోట్లతో పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖల సమన్వయంతో త్వరలో తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలీనం చేసి దాదాపు 55 వేల కుటుంబాలలో వెలుగు నింపిన గొప్ప ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఆర్.టి.సి. కష్టాలు మరింతగా పెరిగాయని, అధికారులతో సమీక్ష అనంతరం ఆర్.టి.సి.పై భారం పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే నిర్ణయాన్ని త్వరలో తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆర్.టి.సి.ని లాభాల బాటలో పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. స్వయం ఉపాదికై ఆటోలు, ట్రాక్టర్లు నడుపుకునే సామాన్య ప్రజల విషయంలో ఏమాత్రం కఠినంగా ప్రవర్తించకుండా, బలవంతపు వసూళ్లు జరుగకుండా వారిని ప్రోత్సహించే విధంగా పోలీస్ ప్రెండ్లీ పరిస్థితులను కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వాహన మిత్ర ద్వారా సొంత ఆటోలు నడుపుకునే వారికి ఏడాదికి రూ.10 వేలు అందజేస్తూ వారందరినీ ఆదుకోవడం జరుగుచున్నదని, భవిష్యత్తులో వారికి మరిన్ని సేవలు అందజేస్తూ వారి మన్ననలు పొందే విధంగా పనిచేస్తామని మంత్రి తెలిపారు. రవాణా శాఖ అధికారులతో త్వరలో సమీక్షా సమావేశం నిర్వహించి శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …