-హరికథ కళాకారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన సత్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గవర్నర్ పేటలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని సోమవారం ఆయన సందర్శించి విశేష పూజలు నిర్వహించారు, పండితులచే వేదాశీర్వాదం అందుకున్నారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలో నిమ్మలూరు చంద్రశేఖర్ భాగవతార్ చే నిర్వహించిన భక్త సిరియాల హరికథ ఆకట్టుకుంది. తెలుగు వారి సంప్రదాయ కళారూపం హరికథ అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో హరికథకు విశిష్ట స్థానముందని వివరించారు. ఒకనాటి సమాజంలో ఉజ్వలంగా విరాజిల్లిన హరికథా ప్రాముఖ్యతను తిరిగి నేటి సమాజంలో ఆదరించేలా చంద్రశేఖర్ భాగవతార్ బృందం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం నిమ్మలూరు చంద్రశేఖర్ భాగవతార్, తబల రాంబాబు, వయోలిన్ దక్షిణామూర్తిలను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వెంట డబ్బుకొట్టు కృష్ణ, మానం వెంకటేశ్వరరావు, వడ్డీ వాసు, ఈవో సాంబశివరావు తదితరులు ఉన్నారు.