విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలో శిష్ట్లాశారద జ్ఞాపకార్థం ఆమె భర్త శిష్ట్లా రామలింగమూర్తి ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వేసవి తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితులలో చల్లని మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రజలు కూడా పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్ళరాదన్నారు. ఎక్కువ ద్రవ పదార్ధాలు, ఓఆర్ఎస్ తీసుకోవాలని తెలిపారు. దాతలు కూడా ప్రజలు అధికంగా సంచరించే బస్టాప్, మార్కెట్లు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మనుషులతో పాటు పశువులు, పక్షులు కూడా తాగునీటికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఆలోచించి తమ ఇంటి పరిసరాల్లో వాటి కోసం ప్రత్యేకంగా నీటి తొట్టిలను ఏర్పాటు చేయాలని కోరారు. చలివేంద్రాల ఏర్పాటుకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. అనంతరం బాటసారులకు మజ్జిగ, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దాతలు శిష్ట్లా రామలింగమూర్తి, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, మైలవరపు రాము, రంగబాబు, కమ్మిలి రత్న, చాంద్, కూనపులి ఫణి, సనత్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …