స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయాలే లక్ష్యం.. గ్రామస్థాయిలోనూ కూటమి జెండా ఎగరాలి

-టీడీపీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
పట్టణ, పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా నాయకులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
94 మున్సిపాలిటీల్లోని 3,235 వార్డుల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారని, 575 జడ్పీటీసీ, 7,500కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. ఈవీఎంలు, బ్యాలెట్, పోస్టల్ విధానం ఏదైనా ప్రజల మద్దతు కూటమికే లభించిందన్నారు. మరో 23 పట్టణాల్లో జరగనున్న ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించాలని ఆకాంక్షించారు.
గ్రామస్థాయి ఎన్నికలను నాయకులు తేలిగ్గా తీసుకోవద్దని చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయిలో మంచి నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఈ ఎన్నికలు చక్కటి అవకాశమని పేర్కొన్నారు. యువతకు, చదువుకున్న వారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించామని, గ్రామస్థాయిలోనూ ప్రజాభిమానమున్న మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు చురుగ్గా ఉంటూ ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించాలని అన్నారు. రాబోయే 30 ఏళ్లకు ఉపయోగపడేలా నాయకత్వాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు దగ్గరగా ఉండాలి.. గొడవలకు దూరంగా ఉండాలి
ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడూ మన వెంటే ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దని, గొడవలకు వెళ్లవద్దని నేతలకు సూచించారు. కొందరు హింసను నమ్ముకుంటే, కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుందని వ్యాఖ్యానించారు. అధికారాన్ని ప్రజలకు మంచి చేయడానికి, వారితో మరింత సన్నిహితంగా ఉండటానికి ఉపయోగించుకోవాలని హితవు పలికారు.
కేంద్రం, రాష్ట్రం, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో ఎన్డీఏ పాలన కొనసాగుతోందని, పంచాయతీల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తే అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలవుతుందని అన్నారు.
గతం కంటే 25 శాతం పెరిగిన ఓటు బ్యాంకు
గతంతో పోలిస్తే కూటమి ఓటు బ్యాంకు 25 శాతం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులంతా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించలేదని అన్నారు. సుమారు ఏడు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిందని, అనకాపల్లి, మార్కాపురం జిల్లాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని వెల్లడించారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి పోలవరం నీరు అందించే చర్యలు, మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ఫలితాలు ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
స్థానిక సంస్థల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రతి నాయకుడు బాధ్యతతో పనిచేయాలని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమర్థవంతమైన నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.