డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ

-మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం 108, 104 తరహాలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ రథాలు తీసుకొచ్చిన జగనన్న ప్రభుత్వం
-మే 19న లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
-పశుపోషకుల గుమ్మం వద్దనే పశువైద్య సేవలు.. ప్రత్యేకంగా 1962 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. అంటూ ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఒక్క ఫోన్‌ కాల్‌తో నిమిషాల్లో ఆపద్భాంవుడిలా వచ్చి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ తరహాలోనే… ఇప్పుడు పశువులకు కూడా సేవలందించడానికి, పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డాక్టర్ వైఎఎస్సార్ సంచార పశు వైద్యశాల’(మొబైల్‌ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్‌) వాహనాలు మే 19 నుంచి సేవలందించబోతున్నాయి. “డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ” పథకం ద్వారా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 సంచార పశు వైద్యశాల వాహనాలు కొనుగోలుతో పాటు వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 175 వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం నాడు గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు.
“డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ” పథకం ద్వారా ప్రస్తుతం మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.142.90 కోట్ల వ్యయంతో 175 వాహనాలు, రెండవ దశలో రూ.134.74 కోట్ల వ్యయంతో మిగిలిన 165 వాహనాలు కొనుగోలుతో పాటు నిర్వహణ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో సైతం పాడి పశువులతో పాటు, పెంపుడు జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన పశువైద్యసేవలు అందించేందుకు వీలుగా ఈ వాహనాల నిర్వహణకు కూడా మన ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ.. ఒక్కొక్క వాహన నిర్వహణకు నెలకు రూ.1.90 లక్షల చొప్పున మొత్తం రెండేళ్లకుగాను దాదాపు రూ. 155 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. సంచార పశువైద్య శాలల ద్వారా పశు ఆరోగ్య సేవలతో పాటు అనారోగ్య పశువు ఉన్న చోటనే సత్వరమే పశువ్యాధి నిర్ధారణ చేసి, ఖచ్చితమైన నాణ్యమైన పశువైద్యం అందించడంతో పాటు, ఆయాప్రాంతాలలో పశువ్యాధులు వాప్తి, నిర్మూలన వంటి అంశాలను అంచనా వేయడంతో పాటు కృత్రిమ గర్భోత్పత్తి సేవలు అందించడం జరుగుతుంది. ఈ వాహనంలో ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కం అటెండర్ మొత్తం ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ వాహనంలో 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త సంబంధిత పరీక్షలు నిర్వహించేందుకు గాను మైక్రోస్కోప్ సౌకర్యము ఉన్న చిన్న ప్రయోగశాల, అవసరమైన మందులు, కృత్రిమ గర్భధారణ సేవలు మరియు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం ఉండేలా తీర్చిదిద్దారు.
రాష్ట్రాన్ని పశుగణ రంగంలో దేశములోనే ప్రధమ స్థానంలో ఉంచాలని, పశుపోషణను మరింత లాభసాటిగా మార్చాలని పశుపోషకులకు మరింత చేరువగా అత్యుత్తమ పశువైద్య సేవలు అందించాలని టోల్ ఫ్రీ నెంబర్ 1962తో పశువైద్య టెలి మెడిసిన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మనిషి ఆపదలో ఉన్నాడని ఫోన్ చేయగానే కుయ్.. కుయ్.. మని అంటూ 108 మరియు 104 అంబులెన్స్ ఎలా వాలిపోతాయో అలాగే పశువు అనారోగ్యానికి గురైనప్పుడు కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేయగానే మారుమూల ప్రాంతాలలోని పశుపోషకులు గుమ్మం వద్దకే నేరుగా సంచార పశువైద్య శాల వాహనం సిబ్బందితో వచ్చి వైద్యం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
‘డా. వైఎస్సార్ పశు ఆరోగ్య సేవ’ పథకం అమలు ద్వారా మన రాష్ట్రములోని మారుమూల ప్రాంతాలలో ఉన్న పశుపోషకులకు సైతం రైతు గుమ్మం వద్దనే సత్వర, ఖచ్చితమైన, నాణ్యమైన పశువైద్యం అంది మూగజీవాలలో మరణాల శాతం తగ్గుతుంది. తద్వారా పశువుల యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడి పశుసంవర్థక శాఖ అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల ద్వారా పశుపోషణ అవసరాలను అధిగమించి పశువులలో ఉత్పాదక శక్తి మరియు ఉత్పత్తి పెరుగుతుంది. పశూత్పత్తులైన పాలు, గ్రుడ్లు, మాంస ఉత్పత్తులు పెరిగి పశుపోషకుల సగటు ఆదాయం పెరిగి వారి జీవన స్థాయి మెరుగు పడటమే కాకుండా జాతీయ స్థూల సంపద పెరుగుదలకు కూడా తోడ్పడే విధంగా.. మనుషుల ఆరోగ్యానికే కాక పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *