– ఆసక్తి గల మెస్, క్యాటరింగ్ సంస్థలు, వ్యక్తులు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలి
– జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి ఇ.జగ్గయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని.. ఇందుకు ఆసక్తి గల మెస్, క్యాటరింగ్ సంస్థలు, వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి ఇ.జగ్గయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు గొల్లపూడి బీసీ భవన్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనంతో పాటు రోజువారీ గుడ్డు, వారంలో రెండు సార్లు చికెన్ అందించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజన సదుపాయం కల్పించేందుకు ఆసక్తి గల సంస్థలు, వ్యక్తులు తమ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, డోర్ నంబర్: 74-2-1/5, అశోక్‌నగర్, పండరిపురం, రోడ్డు నంబర్ 8, విజయవాడ–520007 చిరునామాలో సమర్పించాలని తెలిపారు. పూర్తి వివరాలకు 99668 36381 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
