-తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు: APSDMA
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తుపాను క్రమంగా బలపడుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. రానున్న గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా, గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రస్తుతం తుపాను చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం, విశాఖపట్నాలకు 650 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సహాయక బృందాలు సిద్ధం
తుపాను కదలికలను RTGS, విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, జిల్లా యంత్రాంగాలకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF, 11 SDRF బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు
తుపానుకు ముందు మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలని, వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. విలువైన పత్రాలను వాటర్‌ప్రూఫ్ కవర్లలో భద్రపరచుకోవాలని, కనీసం వారం రోజులకు సరిపడా ఆహారం, తాగునీరు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఇంటి పైకప్పు, తలుపులు, కిటికీల భద్రతను తనిఖీ చేసుకోవాలన్నారు.
తుపాను సమయంలో విద్యుత్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, గ్యాస్ కనెక్షన్లను తొలగించి, తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు ఆదేశించిన వెంటనే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు. చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాల కింద నిలబడరాదని హెచ్చరించారు.
తుపాను అనంతరం అధికారిక ప్రకటన వచ్చే వరకు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లవద్దని, తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. నీటిలో తడిసిన విద్యుత్ పరికరాలను ఎలక్ట్రీషియన్ తనిఖీ చేసిన తర్వాతే ఉపయోగించాలన్నారు.
సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, పడవలు, తెప్పలను సురక్షిత ప్రాంతాల్లో బలమైన తాళ్లతో కట్టుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
తుపాను సంబంధిత సమస్యలను 9552300009 నంబర్లోని ‘మన మిత్ర’ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 112, 1070, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
