గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పీకలవాగు మీద ఆక్రమణలను ఇంజినీరింగ్ మరియు పట్టణ ప్రణాలిక అధికారులు సంయుక్తంగా పర్యటించి, గుర్తించిన వాటిని తొలగించడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక విభాగం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో అవుట్ ఫాల్ డ్రైన్స్ లో పీకలవాగు ప్రధానమైనదని, దీని మీద ఆక్రమణల వలన వర్షాకాలం డ్రైన్ ఓవర్ ఫ్లో జరిగి చుట్టుపక్కల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కనుక ఇంజినీరింగ్, పట్టణ ప్రణాలిక అధికారులు సంయుక్త పర్యటన చేసి, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నగరంలో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తీ చేయాలని, ముందుగా సర్వేయర్లతో సర్వే చేసి, మాస్టర్ ప్లాన్ ప్రకారం మార్కింగ్ చేపట్టి, నష్ట పరిహారం, టిడిఆర్ బాండ్లు తదితర అంశాలను పూర్తీ చేయాలని ఆదేశించారు. నగరంలో సచివాలయాల వారీగా కూలిపోయే స్థితిలో ఉన్న భవనాల వివరాలను సేకరించి, ప్రమాదం జరిగితే ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి, వాటిని యజమానులే తొలగించుకోవాలని నోటీసులు ఇవ్వాలన్నారు. ప్రధాన రహదార్ల పక్కన, భవనాల మీద ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ని పరిశీలించి, వాటి నాణ్యతా ప్రమాణాల పై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడా నగరపాలక సంస్థ అనుమతి లేకుండా నిర్మాణాలు జరగకూడదని, ఆయా సచివాలయాల వారీగా ప్లానింగ్ కార్యదర్శులు అక్రమ లేదా అనధికార కట్టడాలు జరగకుండా సమగ్ర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇంచార్జి సిటి ప్లానర్ బాబురావు, ఏ.సి.పి.లు అశోక్ కుమార్, కాలేష, అజయ్ కుమార్, టి.పి.ఎస్.లు భవాని, స్రవంతి, టి.పి.బి.ఓ. రసూల్, సర్వేయర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …