పీఎం స్వనిధి జాతీయ అవార్డుల్లో ఏపీకి 7 అవార్డులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
పీఎం స్వనిధి పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. మొత్తం ఏడు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. వీటిలో రాష్ట్ర స్థాయిలో మూడు, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో నాలుగు అవార్డులు లభించాయి.
రాష్ట్ర స్థాయిలో రుణాల పంపిణీలో ద్వితీయ, ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో ప్రథమ, సమగ్ర పనితీరులో తృతీయ స్థానం సాధించింది.
పట్టణ స్థానిక సంస్థల విభాగంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ రుణాల పంపిణీలో ద్వితీయ స్థానం, రామచంద్రపురం మున్సిపాలిటీ స్వనిధి సే సమృద్ధిలో ప్రథమ స్థానం, అమలాపురం మున్సిపాలిటీ ద్వితీయ స్థానం, విజయనగరం మున్సిపాలిటీ డిజిటల్ లావాదేవీల్లో ద్వితీయ స్థానం సాధించాయి.
న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రం తరఫున మిషన్ డైరెక్టర్ జి. బాలకృష్ణ, ఐఏఎస్, అదనపు మిషన్ డైరెక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు, ఎస్‌ఎంఎం-బీఎల్ ప్రభావతి అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, ఐఏఎస్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మెప్మా బృందాన్ని, అవార్డులు సాధించిన పట్టణ స్థానిక సంస్థలను అభినందించారు. వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం, జీవనోపాధి మెరుగుదలకు చేసిన సమష్టి కృషికి ఈ అవార్డులు నిదర్శనంగా నిలిచాయి.