-ఒడిశా, జార్ఖండ్ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొంటున్న ఏపీఎండీసీ
-గనుల శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
-ఏపీఎండీసీ ఐపీవోకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆమోదం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అమరావతి, నవంబర్ 20: ఎన్ఎండీసీ తరహాలో ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందుకోసం అవసరమైతే ప్రైవేట్ ఏజెన్సీల సాయం కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు, సమర్ధ వినియోగం, ఆదాయార్జన అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో ఖనిజ వనరుల విలువ పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, మన వనరులు…మన రాష్ట్రంలోనే వినియోగంలోకి తెచ్చేలా ప్రయత్నించాలని సీఎం అన్నారు. ఖనిజ వనరులను కేవలం ఆదాయార్జనగా చూడకుండా…భవిష్యత్ ఆస్తిగా మార్చడమే లక్ష్యం కావాలన్నారు.
రాష్ట్రంలో 209 క్లస్టర్లుగా ఖనిజ నిక్షేపాలు
రాష్ట్రంలో 74,860 చ.కి.మీ. పరిధిలో మొత్తం 582 మినరల్ పొటెన్షియల్ ఏరియాలు గుర్తించి, 209 క్లస్టర్లుగా విభజించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది డిసెంబర్ లక్ష్యంగా ఏపీఎండీసీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేలా ఐపీఓ కార్యాచరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువ ఆధారంగా ఐపీవోకు వెళ్లేలా సీఎం నిర్దేశించారు. ఖనిజ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏపీ రేర్ ఎర్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APREDC) ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ, వాటికి విలువ పెంచడమే లక్ష్యం కావాలన్నారు. వచ్చే ఐదేళ్లలో ఖనిజ అన్వేషణ, వేలం ప్రక్రియ వేగవంతం చేసేలా ప్రణాళిలు అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 6,500 క్వారీ లీజు దరఖాస్తులు, 223 రెన్యువల్స్ పరిష్కారానికి గడువు పొడిగింపు ప్రతిపాదనలపై సమీక్షలో చర్చించారు. పెండింగ్ దరఖాస్తులు, రెన్యువల్స్ పరిష్కారంతో ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా కోసం ఒడిశా, జార్ఖండ్లో మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. మూడు బొగ్గు బ్లాకుల్లో మొత్తం 1,774.6 మిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నాయి. సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
