Breaking News

సీఎం జగనన్నతోనే రాష్ట్రం సుభిక్షం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-29వ డివిజన్ 210 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 29 వ డివిజన్ 210 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మధురానగర్లోని వి.వి.నరసరాజు వీధి, పుట్ట రోడ్డు, మహాత్మగాంధీ వీధులలో విస్తృతంగా పర్యటించారు. దాదాపు 210 గడపలను సందర్శించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. త్రాగునీరు, వీధిలైట్లు, పింఛన్, రేషన్ పంపిణీ వంటి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. పర్యటనలో భాగంగా మహాత్మగాంధీ వీధిలో నీరు నిలిచిపోతున్న కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. సైడ్ డ్రెయిన్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా అధికారులకు సూచించారు. వి.వి.నరసరాజు వీధి, మహాత్మగాంధీ వీధులలో అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యకు జీవో నెం.225 ద్వారా త్వరలో పరిష్కారం చూపుతామని తెలియజేశారు. అలాగే మధురానగర్ ను మోడల్ డివిజన్ గా తీసుకుని 24*7 త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్లలో పేద‌ల జీవితాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చల్లని పాలన ఇదేవిధంగా కొనసాగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

సచివాలయ పరిధిలో రూ. 2.14 కోట్ల సంక్షేమం
కుల, మత, వర్గ, ప్రాంత భేదం లేకుండా అర్హతే ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. 210వ వార్డు సచివాలయ పరిధిలో మూడేళ్లలో రూ. 2.14 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 114 మందికి ప్రతినెలా దాదాపు రూ. 21.37 లక్షలు అందిస్తుండగా.. ఈనెలలో నూతనంగా 37 పింఛన్లు మంజూరైన్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 320 మందికి రూ. 44.80 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 82 మందికి రూ. 10.84 లక్షలు., కాపునేస్తం ద్వారా 31 మందికి రూ. 4.65 లక్షలు., జగనన్న తోడు ద్వారా 10 మందికి రూ. లక్ష., చేయూత ద్వారా 24 మందికి రూ. 2.40 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 8 మందికి రూ. 1.20 లక్షలు., వాహనమిత్ర ద్వారా 20 మందికి రూ. 2 లక్షలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 24 మంది రూ. 2.40 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ నగదును సద్వినియోగపరచుకునేలా లబ్ధిదారులను చైతన్యపరచాలని అధికారులు, సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మధురానగర్ ను మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం
మధురానగర్ ను మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు హయాంలో డివిజన్ పూర్తిగా కళ తప్పిందని విమర్శించారు. 2009 -14 మధ్య కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా వేసిన రోడ్లు తప్ప.. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రోడ్లను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మధురానగర్ లోని సీసీ రోడ్లు, యూజిడి వ్యవస్థ గతంలో తన హయాంలో నిర్మించినవేనని పేర్కొన్నారు. పప్పుల మిల్లు బ్రిడ్జిని పూర్తి చేయడంతో పాటు మధురానగర్ – దేవీనగర్ కలిపే బ్రిడ్జికి సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేసినట్లు వివరించారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మరియు వీఎంసీ నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే రూ. కోటి 15 లక్షల నిధులతో వి.వి.నరసరాజు వీధి ప్రధాన రహదానిని అభివృద్ధిపరిచినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. మధురానగర్లో నూతనంగా కర్మల భవన్ ను నిర్మించుకోవడంతో పాటు లెక్చరర్స్ కాలనీలోని పార్కును అభివృద్ధిపరిచి ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఇందిరా కాలనీలోని యుజిడి సమస్యను సైతం పరిష్కరించడం జరిగిందన్నారు. వీటితోపాటు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగిసే నాటికి ప్రభుత్వ దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికై ఒక్కో సచివాలయానికి రూ. 20 లక్షలు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలియజేశారు.

2024 ఎన్నికలే తెలుగుదేశానికి చివరి ఎన్నికలు
వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిందిపోయి.. వారిని మరింత భయభ్రాంతులకు గురిచేసేలా ప్రతిపక్షాలు వ్యవహరించడం బాధాకరమని మల్లాది విష్ణు అన్నారు. చివరకు ప్రకృతి విపత్తులను కూడా రాజకీయం చేసే దుస్థితికి విపక్షాలు దిగజారిపోయాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలే తప్ప పనిగట్టుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం హేయమని మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం నాయకులు వైఖరి మార్చుకోకుంటే.. 2024 ఎన్నికలే చివరాఖరి ఎన్నికలు కావడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు కంభం మోహన్ రావు, కొండలరావు, జె.కృష్ణప్రసాద్, చీమల గోవింద్, సముద్రపు గోవింద్, కె.శ్రీనివాసరావు, దేవినేని శివాజీ, దేవినేని సుధాకర్, కొంగితల సుధాకర్, పిల్లి వెంకటేశ్వరరావు, కోలా రమేష్ బాబు, నాగమణి, పూర్ణిమ, దుర్గాంబ, నాగప్రియ, వేణు, అంబటి రంగయ్య, వివిధ శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *