అవయువ దానం మహోన్నతం


-మనిషిని తిరిగి బ్రతికించేంది అవయువదానమొక్కటే..
-అవయువ దానంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపొచ్చు
-అవయువ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందాలి
-కుల, మత, జాతి, వయో బేధాల్లేకుండా ప్రతిఒక్కరూ అవయువ దానానికి ముందుకురావాలి
-‘వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే 2కె రన్’ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు, సీపీ కాంతి రాణా టాటా
-అవయువదానంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడొచ్చు
-స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి. అన్వేష్, సీఈవో డాక్టర్ వెంకట్
-రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్, స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2కె రన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా, మరణించిన వ్యక్తిని చిరంజీవిగా చేసే అవయవ దానం మహోన్నతమైనదని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రపంచ అవయువ దాన దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్, స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. అవయువ దాన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం జరిగిన ఈ రెండు కిలోమీటర్ల పరుగును నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా జెండా ఊపి ప్రారంభించగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శారదా కళాశాల వద్ద ప్రారంభమై పడవల రేవు సెంటర్ వద్ద ముగిసిన ఈ 2కె రన్ లో అవయువ దాన ప్రచార కార్యకర్తలు, యువతీ యువకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 2కె రన్ ప్రారంభంలో ఎమ్మెల్యే విష్ణు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా అవయువ దానం మిన్న అని, మనిషిని తిరిగి బ్రతికించగలిగేది అవయువ దానమొక్కటేనని పేర్కొన్నారు. అవయువ దానం పట్ల సమాజంలో నెలకొనివున్న అపోహలు తొలగిపోయేలా, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కుల, మత, జాతి, వయో బేధాలకు అతీతంగా అవయువ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే విష్ణు పిలుపునిచ్చారు. నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ.. అవయువ దానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2కె రన్ నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్, స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి అభినందనలు తెలియజేశారు. మరణించిన వ్యక్తులకు అవయువ దానంతో పునర్జన్మ లభిస్తుందని అన్నారు. ఒక వ్యక్తి తన అవయువాలను దానమందించడం ద్వారా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవయువ దానం అందించేందుకు ముందుకు రావాలని సీపీ కాంతి రాణా కోరారు. స్వర హాస్పిటల్ చీఫ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి. అన్వేష్, సీఈవో డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ.. అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసినవారందరికీ సమాచారం అందించాలని సూచించారు. దీని వల్ల ఆ వ్యక్తి మరణించిన తర్వాత అవయవ దానం చేసేందుకు వీలుకలుగుతుందని తెలిపారు. జీవన్‌దాన్‌ కార్యక్రమం ద్వారా ద్వారా బ్రెయిన్‌ డెడ్‌ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారని, జీవన్‌ధాన్‌ వెబ్‌ సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం ఆర్గాన్‌ డోనర్‌ కార్డును అందజేస్తుందని డాక్టర్ వెంకట్ వివరించారు. మన దేశంలో ఏటా లక్షా 30 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి బ్రెయిన్ డెడ్ అవుతుండగా, వీరిలో కేవలం 150 నుంచి 200 మంది మాత్రమే అవయువ దాతలుగా ఉన్నారని అన్నారు. మన దేశంలో ప్రతి ఏటా మూడు లక్షల మంది కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారని, బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి సేకరించిన మూత్రపిండాలను అమర్చడం ద్వారా వీరిని కాపాడవచ్చని తెలిపారు. అవయవ దానంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ చాలా మందిలో ఇప్పటికీ అవయవదానంపై అపోహలున్నాయని, అవి ఏ మాత్రం వాస్తవం కాదని అన్నారు. మరణానంతరం శాశ్వతంగా జీవించే మార్గం అవయవ దానమేనని, ప్రతి ఒక్కరూ తమ దేహాన్ని ముగించే ముందు మరొకరికి జీవితాన్ని ప్రసాదించాలని డాక్టర్ అన్వేష్, డాక్టర్ వెంకట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ మాగంటి కృష్ణ ప్రభు, సెక్రటరీ కెఎస్ఎన్ బాబు, స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి. అవినాష్, డాక్టర్ ఓలేటి రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *