-నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా
-జీవన దాన్, అరుణ్ కిడ్నీ సెంటర్ ఆధ్వర్యంలో అవయువ దాన అవగాహన ర్యాలీ
-అవయువ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
-ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ నలమాటి అమ్మన్న
-వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ర్యాలీకి విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవయువ దానం ద్వారా మరణించిన తరువాత కూడా తిరిగి జీవించవచ్చని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా అన్నారు. శనివారం ప్రపంచ అవయువ దాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్, అరుణ్ కిడ్నీ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని సీపీ కాంతి రాణా జెండా ఊపి, బెలూన్లను ఎగురవేసి ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో వివిధ సంఘాల ప్రతినిధులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, వైద్యులు, వైద్య సిబ్బంది పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అవయువ దానంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్లకార్డులు చేతబట్టి, అవయువ దానం యొక్క విశిష్టతను తెలియజెప్పేలా మిన్నంటిన నినాదాలతో, ర్యాలీ ముందుకు సాగింది. ర్యాలీ ప్రారంభంలో సీపీ కాంతి రాణా మాట్లాడుతూ.. అవయువ దానం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అవయువ దాన మహోద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న డాక్టర్ అమ్మన్న అభినందనీయులని సీపీ కొనియాడారు. అవయువ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సుదీర్ఘకాలంగా కృషి చేస్తున్న ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ నలమాటి అమ్మన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవయువ దానం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు పూయిస్తుందని అన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను సేకరించి, అనేక మంది ప్రాణాలను నిలబెట్టవచ్చని పేర్కొన్నారు. మరణించిన మనిషిని చిరంజీవిగా, చిరస్మరణీయుడిగా చేసే శక్తి అవయువ దానానికి మాత్రమే ఉందని డాక్టర్ అమ్మన్న అన్నారు. ప్రాణాలను నిలబెట్టే అత్యంత విశిష్టమైన అవయువ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్దార్థ వైద్య కళాశాలకు చేరుకోవడంతో ముగిసిన ఈ ర్యాలీలో ఏపీఎస్పీడీసీఏ డైరెక్టర్, కనెక్ట్ ఆంధ్ర సీఈవో శివశంకర్ రావు, జీవన్ దాన్ చైర్మన్, డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, అరుణ్ కిడ్నీ సెంటర్ సీఈవో శ్రీలక్ష్మి నలమాటి, సిద్దార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.ఎస్. విఠల్ రావు, జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ డాక్టర్ రాంబాబు, హెల్ప్ హాస్పిటల్ సీఈవో జయంత్, మదర్ థెరిసా స్కూల్ ఆఫ్ నర్శింగ్ చైర్మన్ అర్జునరావు, ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, ఫైర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.