-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-సర్వోదయా ట్రస్ట్ నేతృత్వంలో 30 అడుగుల జాతిపిత కుడ్య చిత్ర వగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్
-తన త్యాగనిరతితో ప్రపంచవ్యాప్తంగా మహాత్ముడిగా పిలుపు నందుకుంటున్న గాంధీజీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాల ఫలితంగా మనం మహాత్ముడిని జాతిపితగా గౌరవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గాంధీ మహాత్ముడు దేశాన్ని స్వాతంత్ర్యం వైపు నడిపించడమే కాక, ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర్య పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాడన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపధ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా సర్వోదయ ట్రస్ట్ నేతృత్వంలో విజయవాడలో మహాత్మా గాంధీజీ 30 అడుగుల కుడ్య చిత్ర విగ్రహాన్ని గౌరవ గవర్నర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ భారతదేశంలో అహింస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, సహయ నిరాకరణ ఉద్యమం ద్వారా విజయం సాధించారన్నారు.
దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమం ఇలా ఎన్నో ఉద్యమాలకు రూపకల్పన చేసి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు ముగుస్తున్న తరుణంలో దేశభక్తికి ప్రేరణగా తిరంగాను ఇంటికి తీసుకువచ్చి, ఆవిష్కరింపచేయటానికి “హర్ ఘర్ తిరంగ” అమలవుతుందన్నారు. ఆగస్టు 15 వరకు తమ నివాసాలపై ప్రతిఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.. ఈ చర్యలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని పెంపొందిస్తూ, దేశాన్ని ఐక్యత దిశగా నడిపే ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ నినాదం దిశగా పయనింపచేస్తాయని హరిచందన్ అన్నారు.
సర్వోదయ ట్రస్ట్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, భావసారూప్యత కలిగిన సామాజిక కార్యకర్తలు, పరోపకారుల భాగస్వామ్యంతో పనిచేస్తుండటం ముదావహమన్నారు. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు గద్దె లింగయ్య పేరు మీద ఒక గ్రంధాలయం నిర్వహించటం అభిలషనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య వీరుల, దేశభక్తుల భూమి అన్న గవర్నర్, పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి స్వాతంత్య్ర సమరయోధుల సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. కృష్ణ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం గాంధేయ తత్వానికి నాడి కేంద్రంగా పనిచేస్తుండటం, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించే లక్ష్యంతో ట్రస్ట్ పనిచేయటం అభినందనీయమన్నారు.
రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ కృష్ణా జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం భవనం దాతృత్వవేత్తలు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఇతరుల విరాళాలతో నిర్మితమై 1986లో నాటి రాష్ట్రపతి జైల్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభమైందన్నారు. భారత మాజీ రాష్ట్రపతి వెంకటరామన్ తో సహా పలువురు ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించారన్నారు. సర్వోదయా ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ జివి మోహన ప్రసాద్ మాట్లాడుతూ 1995లో సర్వోదయ ట్రస్ట్ స్థాపించబడిందని గాంధీ విజ్ఞాన మందిర నిర్వహణతో పాటు విద్యా, పర్యాటక ఆకర్షణల ప్రదేశంగా దీనిని మరింత అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. వేడుకలలో భాగంగా స్వాతంత్ర సమర యోధులు, వారి కుటుంబ సభ్యులను గవర్నర్ సన్మానించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్, స్వాతంత్ర సమర యోధురాలు మనోరమ, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ ఎంసి దాస్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోతుకూరి వెంకటేశ్వరరావు, పలువురు స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు , విజయవాడ నగర ప్రముఖులు పాల్గొన్నారు.