పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్లు !

-విద్యార్ధులకు ఇంధన పొదుపు , ఇంధన సామర్థ్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఎనర్జీ క్లబ్లు
-కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఈఈ సహకారంతో వినూత్న ఆలోచన
-ఎనర్జీ క్లబ్లు పాఠశాల విద్యార్థులలో అవగాహన కల్పించి, ఇంధన పొదుపు దిశగా తమ తోటివారు, కుటుంబాలు, సమాజాన్ని చైతన్యవంతం చేస్తాయి.
-విద్యార్ధుల ద్వారా సమాజంలోని ప్రజలకు అవగాహన
-75 పాఠశాలలు ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపాయి
-విద్యార్థులను పెద్ద ఎత్తున పాల్గొనేలా పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి–ఎస్ఈసిఎంకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశం
-తగ్గుతున్న ఇంధన వనరులు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం
-ఎనర్జీ క్లబ్ల ఏర్పాటుకు విద్యాశాఖతో ఏపీఎస్ఈసిఎం సమన్వయం
-85 మోడల్ స్కూల్స్లో ఇంధన సామర్ధ్య చర్యలు అమలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధనాన్ని ఆదా చేయడం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం సమాజంలోని అన్ని వర్గాలలో ఇంధన సామర్థ్యం , ఇంధన పొదుపు సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనే లక్ష్యంలో భాగంగా, ఇంధన శాఖకు చెందిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ సహకారంతో లక్షలాది మంది విద్యార్థులను దశలవారీగా ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేలా చేయాలని యోచిస్తోంది.

రాష్ట్రంలో ఒక వైపు ఇంధన డిమాండ్ క్రమంగా పెరుగుతుండగా మరోవైపు ఇంధన వనరులు వేగంగా క్షీణిస్తున్నాయి. అందువలన ఇంధన వృధాను నివారించడంతోపాటు సహజ వనరులను రక్షించడానికి విద్యార్ధులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఇంధనాన్ని ప్రోత్సహించడం, ఆదా చేయడం వంటి వాటిలో రేపటి నిర్ణయాధికారులుగా పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయడం చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది.

ఎనర్జీ కన్జర్వేషన్ మరియు ఎనర్జీ ఎఫీషియన్సీ విధానాన్ని విద్యార్ధులు కూలంకుశంగా అర్ధం చేసుకునేందుకు ఎనర్జీ క్లబ్లు చాలా అవసరం కానున్నాయి. విద్యార్ధులు రేపటి తరానికి ప్రతినిధులుగా వ్యవహరించాల్సి ఉన్న నేపథ్యంలో బాధ్యతగల పౌరులుగా వారిని తీర్చిదిద్దే క్రమంలో వీరికి ఎనర్జీ కన్జర్వేషన్ అంశాలపై మరింత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ విధంగా విద్యార్ధులను ప్రోత్సహించడం ద్వారా సమాజంలోని అందరికీ ఇంధన సామర్ధ్య ఉపకరణాలను పెద్ద ఎత్తున ఉపయోగించేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఒక పాఠశాలలోని విద్యార్ధులు అదే పాఠశాలలోని విద్యార్ధులతోగానీ లేదా ఇతర పాఠశాలల విద్యార్థులతోగానీ ఇంధన సామర్ధ్య చర్యలపై పరస్పరం సంభాషించుకోవడం ద్వారా వాటిని మరింతగా ప్రోత్సహించడం, అమలు చేయడం తేలికవుతుందని పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్లను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్లబ్ల ద్వారా విద్యార్ధులు ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య చర్యలపై పొందిన అవగాహనతో తమ కుటుంబాలు, పొరుగువారికి వివరించి పెద్ద ఎత్తున ఇంధన సామర్ధ్య చర్యలను ప్రోత్సహించేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అనేక రెట్లు విస్తరించి, దేశంలోనే అత్యంత ప్రభావ వంతమైన ఇంధన సంరక్షణ, సామర్థ్య కార్యక్రమంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.

ఇదే క్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను కూడా విద్యార్ధులతోపాటు భాగస్వామ్యులను చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలన్నది ఈ ఎనర్జీ క్లబ్ల ఏర్పాటులో లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా విద్యార్ధుల్లోని సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను బయటకు తీసుకురానున్నారు. అంతిమంగా ఇంధన పరిరక్షణపై ప్రజల చేరువను పెంపొందించడమే కాకుండా తదుపరి పరిశోధనలను ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)లను రాష్ట్ర విద్యా శాఖతో సమన్వయం చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు చేసి అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇప్పటి వరకు, దాదాపు 75 పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపాయి.

ఏపీఎస్ఈసీఎం అధికారులు ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఎనర్జీ క్లబ్ల ఏర్పాటు, లక్ష్యాల గురించి ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్కు తెలియజేశారు. ఈ కార్యక్రమ ఏర్పాటును అభినందించిన ఆయన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను ఆకర్షించేలా మంచి కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విజయవంతమైన ఫలితాలు సాధించేలా పాఠశాలల్లో ఇంధన సామర్ధ్య చర్యలపై అటు విద్యార్ధులకు, ఇటు ఉపాధ్యాయులకు అవగాహన పెంపొందించాలని సూచించారు.

ఎపిఎస్ఇసిఎం ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ద్వారా పాఠశాలల నుంచి సుముఖత కోరినట్లు ఈ సందర్భంగా అధికారులు విజయానంద్కు వివరించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ నుండి వచ్చే గ్రాంట్ల మేరకు ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు చేయడంలో పాఠశాలలకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎనర్జీ క్లబ్ల నిర్మాణం మరియు కార్యకలాపాలు, సభ్యుల పాత్రలు మొదలైన వాటి కోసం బీఈఈ మార్గదర్శకాలను నిర్దేశించిందని వివరించారు. దీని ప్రకారమే ఏపీఎస్ఈసీఎం ఈ అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పాఠశాల విద్యా శాఖతో సమన్వయం చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఎనర్జీ క్లబ్ల ద్వారా ఇంధన సామర్ధ్యం మరియు ఇంధన పొదుపుపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, డిబేట్లు, క్విజ్, సైన్స్ పోటీలు, స్కిట్లు, నాటకాలు మొదలైనవాటిని నిర్వహించడం వంటి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇంధన సామర్ధ్య చర్యలపై అవగాహనా కార్యకలాపాలే కాకుండా రాష్ర్టంలోని 85 మోడల్ స్కూల్స్లో పైలట్ ప్రాజెక్ట్ను ఏపీఎస్ఈసీఎం అమలు చేసిందన్నారు. రాష్ర్టంలోని వివిధ జిల్లాల్లోని పాఠశాలల్లో పాత లేదా వాడుకలో లేని ఉపకరణాల స్థానంలో ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు మరియు ఎనర్జీ ఎఫెక్టివ్ ఫ్యాన్ల వంటి శక్తి సామర్థ్య విద్యుత్ ఉపకరణాలతో భర్తీ చేసినట్లు తెలిపారు.

శాస్త్రీయ పద్ధతిలో 85 పాఠశాలల్లోని 51 మోడల్ స్కూల్స్లో ఇంధన సామర్థ్య ఉపకరణాలు ఉపయోగించడం వల్ల కలిగే ప్రభావాన్ని అంచనా వేయడం జరిగిందన్నారు. సంవత్సరానికి 3.79 లక్షల యూనిట్ల విద్యుత్తును దాదాపు రూ. 23 లక్షల మేర ఆయా మోడల్ స్కూళ్లలో పాత ఉపకరణాల స్థానంలో ఎనర్జీ ఎఫిషియెంట్ ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా ఆదా చేయడం జరిగినట్లు ఈ అధ్యయనంలో తేలిందన్నారు. మొత్తం 85 మోడల్ పాఠశాలల్లో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా సంవత్సరానికి సుమారు 6.31 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *