గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని వార్డుల సభ్యుల స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయి, కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ / విలీనానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసింది. పోలీసు, పోలింగ్ సిబ్బంది నియామకం, రవాణా మరియు ఇతర ఎన్నికల నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, ఈ ప్రక్రియలో కింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి:

1. విలీనం చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 650 మందికి మించరాదు.

2. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పోలింగ్ సిబ్బందిని నియమించాలి.

3. ఒకే ప్రాంగణం లేదా ఒకే ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను మాత్రమే విలీనం చేయాలి. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలను విలీనం చేయరాదు.

4. విలీనం చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు మార్గనిర్దేశం చేసేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి.

5. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఆయా ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా సమాచారం అందించాలి.

ఈ మేరకు రాష్ట్రంలోని కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.