-దోమల నియంత్రణపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల నియంత్రణపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం పైపులరోడ్డులో జరిగిన యాంటీ మలేరియా యాక్టివిటీస్ పై అవగాహన సదస్సులో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, ఉమ్మడి రమాదేవిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టాల్స్ ద్వారా విస్తృత అవగాహన కల్పించారు. ప్రజలలో చైతన్యపరిచే విధంగా ఏర్పాటు చేసిన డప్పు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులను అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, వీఎం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే నియంత్రించే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. బందరు, ఏలూరు, రైవస్, బుడమేరు కాల్వలలో దోమల లార్వా చేరకుండా యాంటీ లార్వా ఆపరేషన్స్ చేపట్టడం జరుగుతోందన్నారు. డెంగ్యూ దోమలు మంచినీటిలో ఎక్కువగా గుడ్లు పెడతాయని.. కనుక గృహాల్లోని నీటి తొట్టిలు, డ్రమ్ములు, ట్యాంకులలో కనీసం మూడు రోజులకోసారి నీటి నిల్వలను తొలగించాలని నగర ప్రజలకు సూచించారు. ప్రతి శుక్రవారం నివాసాలలో డ్రైడే పాటించడం తద్వారా దోమల వృద్దిని అరికట్టవచ్చని తెలిపారు. అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా అధికారులు, శానిటేషన్ సెక్రటరీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దోమలు నియంత్రణకు ప్రతీరోజు ఫాగింగ్ చేయాలన్నారు. హోటల్స్, తినుబండారాల బండ్ల వద్ద అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. అలాగే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఆరు నెలల సమయం దాటినట్లయితే బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) సత్యవతి, జోనల్ కమిషనర్ (ఇంఛార్జి) అంబేద్కర్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, బయాలజిస్ట్ బాబూ శ్రీనివాస్, నాయకులు అలంపూర్ విజయ్, ఉమ్మడి వెంకట్రావు, అఫ్రోజ్, కాళ్ల ఆదినారాయణ, వీరబాబు, రామిరెడ్డి, నాళం బాబు, ఆర్.ఎస్.నాయుడు, పార్టీ శ్రేణులు, ఆశావర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.