గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో జరిగే అభివృద్ధి పనుల వివరాలు పక్కగా నమోదు చేయడానికి, పనులు పూర్తీ చేసిన వెంటనే బిల్స్ ప్రాసెస్ వేగంగా చేయడానికి వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులకు ఎం.బుక్ నమోదు భాధ్యత కేటాయించబోతున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. శుక్రవారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇంజినీరింగ్ అధికారులు, వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులతో కమిషనర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో ఎం.బుక్ కీలకమని, పనుల వివరాలు తెలియడానికి, బిల్లుల చెల్లింపుకు ఎం.బుక్ ప్రామాణికం కనుక నూతనంగా ఎమినిటి కార్యదర్శులకు ఎం.బుక్ రికార్డింగ్ భాధ్యతలు కేటాయించబోతున్నామని తెలిపారు. ఎం.బుక్ నిర్వహణలో అత్యంత భాద్యతగా విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుండి నగరంలో టెండర్ పొందిన పనులు నిర్దేశిత గడువులోగా పూర్తీ కావాలని, పనులు పూర్తి అయిన వెంటనే బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా కార్యదర్శుల పోస్ట్ లు ఖాళీగా ఉంటే వెంటనే ఇంచార్జిలను నియమించాలన్నారు. స్పందన, ఈ.ఆర్.పి.లో ఫిర్యాదులు, అర్జీలు బియిండ్ ఎస్.ఎల్.ఏ.లోపే పరిష్కారం చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్థానిక ప్రజల నుండి ఫిర్యాదులు, అర్జీల స్వీకరణ కోసం స్పందన నిర్వహించాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో త్రాగునీటి శ్యాంపిల్స్ పక్కాగా సేకరణ చేయాలని, వీధి దీపాల పై అందే ఫిర్యాదులు 24 గంటలలోగా పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయం వారీగా మొత్తం ఇళ్లు, ట్యాప్ కనెక్షన్లు, మీటర్ కనెక్షన్ల వివరాలు సమగ్ర సర్వే చేసి ఇవ్వాలన్నారు. నగరంలో ఎక్కడా త్రాగునీటి పైప్ లైన్లు డ్రైన్లలో లేదా పైన ఉండకూడదన్నారు. పాఠశాలల్లో చేపట్టిన నాడు నేడు పనులు సమగ్రంగా జరగాలని, క్షేత్ర స్థాయిలో సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఎస్.ఈ. రామమోహనరావు, ఈ.ఈ.లు సుందర్రామిరెడ్డి, శాంతిరాజు, కొండారెడ్డి, డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు, వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …