-రూ. 3.72 కోట్ల నిధులతో అదనపు తరగతుల నిర్మాణానికి ఎమ్మెల్యే చేతులమీదుగా భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద పిల్లలు పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప డాక్లర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎల్బీఎస్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి రూ. 2.40 కోట్ల నిధులతో 20 అదనపు తరగతి గదులు., పాయకాపురంలోని సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో రూ. 1.32 కోట్ల నిధులతో 11 అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు రూ. కోటి నిధులతో పాఠశాలల మరమ్మతుల పనులకు స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో కలిసి సోమవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, గత మూడేళ్లలో ఈ రంగానికి రూ. 53 వేల కోట్ల నిధులు ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. పాఠశాల విద్యకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో గత మూడేళ్లలో రూ. 202.31 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అలాగే 28 ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 33.49 కోట్ల నిధులతో 168 అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. వీటిలో 12 హైస్కూల్స్ కు సంబంధించి 155 అదనపు తరగతులు కాగా 16 ప్రాథమిక పాఠశాలల్లో 13 నూతన తరగతుల నిర్మాణానికి రూ. 20.21 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయా పాఠశాలల మరమ్మతులకు మరో రూ. 13.28 కోట్లు మొత్తంగా రూ. 33.49 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అమ్మఒడి, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, విద్యాకానుక, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో జగనన్న ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అమ్మఒడి పథకానికి సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో 25 వేల మంది తల్లుల ఖాతాలలో మూడేళ్లలో రూ. 112.91 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. విద్యాకానుక ద్వారా 15,474 మంది విద్యార్థులకు ఏటా నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడేళ్లలో రూ. 8.64 కోట్లు ఖర్చు చేశామన్నారు. నాడు-నేడు ద్వారా బ్లాక్ బోర్డ్, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, త్రాగునీరు, టాయిలెట్లు, కాంపౌండ్‌వాల్ ఇలా పదిరకాల సౌకర్యాలను కల్పించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన విషయంలోనూ ఎక్కడా రాజీపడకుండా చిన్నారులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఏటా ఇందుకోసం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తుండగా.. గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు బిల్లులను క్లియర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసాన్ని కల్పించారని పేర్కొన్నారు. దీంతో గత ప్రభుత్వంలో 37 లక్షలు మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య.. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా గణనీయంగా పెరిగి 43 లక్షలకు పైగా చేరిందన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు భవిష్యత్ లో ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు పూర్తి సహాయ సహకారాలను అందించి ప్రోత్సహిస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈ అరుణ్ కుమార్, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, యరగొర్ల తిరుపతమ్మ, నాయకులు అలంపూర్ విజయ్, యరగొర్ల శ్రీరాములు, వీరబాబు, రామిరెడ్డి, హైమావతి, జిల్లెల్ల శివ, పందిరి వాసు, ఇస్మాయిల్, మేడా రమేష్, అక్తిశెట్టి నారాయణ, రెడ్డెమ్మ, బోరాబుజ్జి, యోహాన్, చక్కా నరసింహారావు, తులసమ్మ, కుమారి, చిన్నారి, వరాలమ్మ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.