-జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. జిల్లా క్రీడా ప్రాధికర సంస్థ మరియు యువజన సర్వీసుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా ఆయన జన్మదినం రోజున జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. జవాన్ గా జీవితాన్ని ప్రారంభించి.. సైనికాధికారుల ప్రోత్సాహంతో చక్కటి ఆటగాడిగా ఎదిగి ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ మెరుపులు మెరిపించారన్నారు. హాకీలో భారత్ కు ఆయన అనేక చారిత్రాత్మక విజయాలు అందించారని.. భారత్ పేరు ప్రపంచపటంలో మారుమ్రోగి పోవడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. క్రీడల ప్రాముఖ్యత గురించి యువతలో అవగాహన కల్పించడం, ఆటల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలియపరచడమే జాతీయ క్రీడా దినోత్సవ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడంతో పాటు వారిని వెలుగులోకి తీసుకురావడానికి ‘జగనన్న స్పోర్ట్స్ క్లబ్’ల పేరిట క్రీడాభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అలాగే క్రీడల ద్వారా యువత అనేక ఉద్యోగావకాశాలు పొందే అవకాశముంటుందని తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలలో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. జీవో నెం. 74 ని కూడా తీసుకురావడం జరిగిందన్నారు. దీని ద్వారా దాదాపు 2,500 మంది పలు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగావకాశాలు పొందినట్లు వెల్లడించారు. వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా మైదానాలు ఉండేవిధంగా చూస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగపరచుకుని యువత క్రీడల్లో రాణించి జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కుక్కల అనిత, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) ఉమామహేశ్వరరావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యు.శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ అజీజ్, క్రీడాప్రాధికార సంస్థ కోచ్ లు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.