-జగనన్న విదేశీ విద్య పథకానికి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ
-సెప్టెంబర్ 30 లోపుగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
-సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న విదేశీ విద్య పథకంలో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ పథకంలో ఏడాదికి ఇంత మందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టం చేసారు. ఈ పథకంలో లబ్ది పొందడానికి విద్యార్థులు సెప్టెంబర్ 30 వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
జగనన్న విదేశీ విద్య పథకానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైన నేపథ్యంలో సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాలకు కూడా విదేశీ విద్య అందుబాటులోకి తీసుకువస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేసారు. ప్రస్తుతం జ్ఞానభూమి పోర్టల్ ద్వారా జగనన్న విదేశీ విద్య పథకంలో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతోందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు, జీవో లతో పాటుగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి ఎంపిక చేసిన క్యూ.ఎస్. 1 నుంచి 200 దాకా ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల జాబితాను కూడా ఆ వెబ్ సైట్ లోనే అందులో పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ యూనివర్సిటీలలో 1 నుంచి 100 లోపు క్యూఎస్ ర్యాంక్ కలిగిన యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారికి కోటి రుపాయలైనా కూడా పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ చేయడం జరుగుతుందని, 101 నుంచి 200 లోపు ర్యాంక్ కలిగిన యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారికి రూ.50 లక్షల వరకూ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ చేయడం జరుగుతుందని నాగార్జున పునరుద్ఘాటించారు. 8 లక్షల రుపాయలకు లోపు వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు అందరూ ఈ పథకంలో లబ్ది పొందడానికి అర్హులేనని గుర్తు చేసారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు జగనన్న విదేశీ విద్య కోసం తమ దరఖాస్తులను సమర్పించడం జరుగుతోందని చెప్పారు. ఆయా కేటగిరీలకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను రాష్ట్ర స్థాయి అధికారిక కమిటీలు పరిశీలించి వాటిలో అర్హులైన విద్యార్థుల జాబితాను సాంఘిక సంక్షేమశాఖకు సమర్పించడం జరుగుతుందని నాగార్జున తెలిపారు. సెప్టెంబర్ 30 లోపుగా విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జగనన్నవిదేశీ విద్య పథకంలో ఎంత మంది అర్హత సాధిస్తే, అంత మందికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని, అందుకే ఈ పథకాన్ని అర్హత కలిగిన విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని నాగార్జున కోరారు. ప్రపంచ స్థాయిలో అత్యధిక ర్యాంకు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు సాధించడానికి అవసరమైన టోఫెల్, జిఆర్ఇ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత శిక్షణ ఇచ్చే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని నాగార్జున వెల్లడించారు.
అంబేద్కర్ స్టెడీ సర్కిళ్లలో మరింత పటిష్టశిక్షణ:
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ స్టెడీ సర్కిళ్లలో తర్ఫీదు పొందే అభ్యర్థులకు మరింత మెరుగ్గా పటిష్ట శిక్షణనను అందించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి నాగార్జున ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్టెడీ సర్కిళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ఉన్న అంబేద్కర్ స్టెడీ సర్కిళ్లలో ప్రస్తుతం ఇస్తున్న శిక్షణలు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షిస్తూ, అంబేద్కర్ స్టెడీ సర్కిళ్లకు డైరెక్టర్లను నియమించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు నిరంతరంగా గ్రంధాలయ సౌకర్యం ఉండేలా చూడాలని సూచించారు. స్టెడీ సర్కిళ్లలో మంచి ఫ్యాకల్టీని నియమించడం తో పాటుగా అభ్యర్థులకు అవసరమైన మంచి మెటీరియల్ ను కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ స్టెడీ సర్కిళ్ల ద్వారా మరింత మెరుగైన శిక్షణను అందించడానికి ఏం కావాలో తనకు ప్రతిపాదనలు ఇవ్వాలని కూడా నాగార్జున అధికారులను కోరారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ఇన్ ఛార్జ్ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, జేడీ శ్రీనివాసులు, డిప్యుటీ సెక్రటరీ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.