అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో ఎంతో ఘనంగా జరిగింది. చైర్మన్ మరియు మెంబర్ సెక్రటరీతో కలుపుకుని మొత్తం 21 మంది సభ్యులతో కూడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జి.ఓ.ఎంఎస్.నెం.571 ను ఈ నెల 13 న జారీచేసిన విషయం విదితమే. సదరు ఉత్తర్వులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ , దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ సభ్యులుగా మరియు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ మెంబర్ సెక్రటరీగా మరియు మరో 18 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఎంతో ఘనంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో టి.టి.డి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.వి.ధర్మారెడ్డి, వై.ఎస్.ఆర్.జిల్లా పుష్పగిరి మఠాధిపతి జూమ్ కన్పరెన్సురెన్సు ద్వారా ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన సభ్యులు భీమవరానికి చెందిన దంతులూరి జగన్నాధరాజు చౌల్ట్రీ ఫౌండర్ ట్రస్టీ ఎం.రామకుమార్ రాజు, అన్నవరానికి చెందిన ఇనుగంటి వెంకట రోహిత్, కడపకు చెందిన యదళ్ల పిచ్చియ్య చెట్టి చారిటీస్ అసోషియేషన్ ఫౌండర్ డా.జ్వాలా చైతన్య, మాకా బాలాజీ, పాలకొల్లు కు చెందిన శ్రీ చాకావారి చౌల్ట్రీ ఫౌండర్ చాకా ప్రభాకరరావు, రాజన్ సుభాషిణి, తిరుమల పెదజీయంగార్ మఠాధిపతి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు మరియు రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి అజయ కల్లాం, దేవాదాయ శాఖ రిటైర్డు అడిషనల్ కమిషనర్ ఎ.బి.కృష్ణారెడ్డి, హైకోర్టు రిటైర్డు జడ్జి మఠం వెంకట రమణ, రిటైర్డు ప్రిన్సిఫల్ స్పెషల్ జడ్జి కె.సూర్యారావు, ఫిలాంత్రోఫిస్టులు సంగా నరసింహారావు, యు.కె.విశ్వనాథరాజు, ఆగమ పండితులు పి.వి.ఎస్.ఎస్.ఆర్.జగన్నాధాచార్యులు, చర్రావూరి శ్రీరామ శర్మ మరియు చార్టెడ్ ఎక్కౌంటెంట్ శ్రీరామమూర్తి తదితరులు నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొని సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ మత ధర్మంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమే ఈ ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ను ఏర్పాటమన్నారు. ఆ భవంతుని సహకారంతోనే ఎన్నో సుసాద్యమైన పథకాలను, కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెపుతుంటారని, భగవంతునిపై వారికి ఉన్న భక్తికి ఇది కూడా ఒక నిదర్శనమన్నారు. 2009 లో ఏర్పాటు చేయబడిన ఈ ధార్మిక పరిషత్ మూడు సంవత్సరాలు కొనసాగిందని, తదుపరి 2014 లో ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. అయితే హిందూ ధార్మిక కార్యక్రమాలను అన్నింటినీ ఇంకా విస్తృతంగా అమలు చేయాలనే అత్యున్నతమైన లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో చిత్తశుద్దితో ఈ ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలన్నీ అభివృద్ది పథంలో నడపాలని, దేవాలయాల్లో ఎటు వంటి అవకతలకు అస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, హిందూ మత ప్రచారానికి చిత్తశుద్దితో పనిచేస్తున్న పీఠాలన్నింటి సేవలను సద్వినియోగం చేసుకోవాలనే అత్యున్నత లక్ష్యంతో ప్రభుత్వం ఈ ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంతో నిష్టాతులైన వారితో ఏర్పాటు చేసిన ఈ ధార్మిక పరిషత్ సేవలను ప్రభుత్వం ఎంతో పటిష్టంగా వినియోగించుకోవడం జరుగుతుందని, సభ్యుల సూచనలను, సలహాను అన్నింటినీ పరిగణలోకి తీసుకుని చిత్తశుద్దితో వాటిని అమలు చేస్తామని ఆయన తెలిపారు. తాను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయడం ఎంతో గర్వంగాను, సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేశారు. అదే విధంగా తమ భాద్యతలను ఎంతో చిత్తశుద్దితో నిర్వహిస్తానని, ఈ రాష్ట్రంలోని దేవాలయాల పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఆయన తెలిపారు.
రాష్ట్ర ధర్మాదాయ, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేస్తూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ కొట్టు సత్యనారాయణకు మరియు సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ మరియు సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.